Fri Nov 22 2024 18:56:29 GMT+0000 (Coordinated Universal Time)
Godavari Pushkaras : గోదావరి పుష్కరాలకు పోదాం రారండి.. ఏర్పాట్లు షురూ
కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది
కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. గోదావరి పుష్కరాలకు అంతా సిద్ధమవుతుంది. ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రభుత్వం పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్ని సౌకర్యాలతో పాటు భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయాలని నిర్ణయించింది.
ముందస్తు కార్యాచరణ...
ఇందుకోసం ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చేపట్టాల్సిన పనుల పైన నిర్ణయానికి వచ్చారు. ఈ సారి గోదావరి పుష్కరాలు2027 జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. నదీ పుష్కరాలు పన్నెండేళ్లకు ఒకసారి అన్ని నదులను పూజించడం మన సంప్రదాయంగా వస్తుంది. అందులో భాగంగానే నదులకు హారతులివ్వడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పుష్కరాల సమయంలో అందులో స్నానమాచరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే పుష్కరాల కోసం భక్తులు కళ్లకు వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తుంటారు.
ఏర్పాట్లను చేయడం కోసం....
ఈ సారి పుష్కరాల కోసం ఎనిమిది కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తుంది. గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదలు అధికార యంత్రాంగం సిద్దం చేసింది. సుమారు రెండున్నరేళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటి నుంచే పనులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పుష్కర ఏర్పాట్ల పైన కీలక కసరత్తు చేశారు.పుష్కరాలకు వచ్చే భక్తులు అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని అధికారులు గుర్తించారు. అలాగే వచ్చిన భక్తుల కోసం వసతి సదుపాయాలను కూడా గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టారు.
రాజమండ్రికే ఎక్కువ...
ప్రధానంగా ఎక్కువ మంది భక్తులు గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రికి ఎక్కువ మంది వస్తాారు. అందుకోసం రాజమండ్రి నగర పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. కార్పొరేషన్ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్అండ్బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సిటీ బ్యూటిషికేషన్, ఐకానిక్ టూరిజం సైట్ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదించారు.
ముందస్తు ఏర్పాట్లు
చేస్తున్నారు. ఈసారి గోదావరి పుష్కరాలకు జిల్లాను యూనిట్గా తీసుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది.
Next Story