Mon Dec 23 2024 11:42:25 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. శుక్రవారం అన్ని కంపార్ట్మెంట్లూ
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. శుక్రవారం అన్ని కంపార్ట్మెంట్లూ భక్తులతో నిండిపోయి క్యూలైన్ వెలుపలికి వచ్చేశారు. నేడు టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 59,808 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.6 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 25,618 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్, టీటీడీలోని అన్నివిభాగాల అధికారులతో ఈవో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబరు 18న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా శ్రీనివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనం, తిరుమలలో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయన్నారు. గరుడసేవను రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరికీ దర్శనం కల్పిస్తూ నిదానంగా ముందుకు తీసుకెళతామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, వారికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనంతోపాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామని చెప్పారు. బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడవని, స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్టు వెల్లడించారు.
Next Story