Sun Nov 17 2024 10:36:36 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. నేడు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. గురువారం స్వామివారిని 58,855 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.65 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నేడు శ్రీవారి మాడవీధుల్లో ఉట్లోత్సవం జరగనుంది. ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు.
శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, భక్తుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. అటవీశాఖ అధికారుల సహకారంతో, దాదాపు 300 మంది అటవీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో నిరంతర కృషి జరుగుతోందని చెప్పారు. ఈ కారణంగానే ఐదవ చిరుతను ఈ రోజున పట్టుకోవడం జరిగిందన్నారు. నడక దారిలో నడుస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించమని, వారితో పాటు తోడుగా భద్రత సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు చేసామన్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే చిన్న పిల్లలు నడిచేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. భక్తులలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం చేతి కర్రలు కూడా ఇవ్వడం ప్రారంభించామన్నారు.
Next Story