Mon Dec 23 2024 15:16:25 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ జూలై 26వ తేదీన పల్లవోత్సవం నిర్వహించనుంది.
తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోంది. వారాంతం కావటంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని 71,721 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.88 కోట్ల రూపాయలు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. స్వామివారికి 32,078 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ జూలై 26వ తేదీన పల్లవోత్సవం నిర్వహించనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి తిరుమలలో పల్లవోత్సవం జరుగుతోంది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు. అప్పట్లో ఆలయ నిర్మాణానికి, పలు సేవలకు ఎంతో దానం చేసిన మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతినెలా ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాలలో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీమలయప్పస్వామివారు కర్ణాటక సత్రాలకు వేంచేపు చేస్తారు.
Next Story