Mon Dec 23 2024 07:13:18 GMT+0000 (Coordinated Universal Time)
వీకెండ్.. తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 1వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం
శనివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 69,378 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,371 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 1వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆలయంలో ఉదయం 9 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 30వ తేదీ తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరుగనుంది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామివారి ఆస్థానం ఘనంగా జరుగనుంది. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.
Next Story