Mon Nov 25 2024 10:01:40 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
ఆగస్టు 12వ తేదీ నిర్వహించనున్న శుద్ధ తిరుమల- సుందర తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించడానికి
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69270 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 28755 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇదిలా ఉండగా టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వున్నారు. స్వామి వారికి 3.74 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది.
ఆగస్టు 12వ తేదీ నిర్వహించనున్న శుద్ధ తిరుమల- సుందర తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో శుక్రవారం ఆమె ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, తిరుమల పవిత్రత, పర్యావరణాన్ని కాపాడటానికి ఈవో ఎవి ధర్మారెడ్డి పిలుపు మేరకు ఈ ఏడాది మే 13వ తేదీ తొలిసారిగా నిర్వహించిన శుద్ధ తిరుమల సుందర తిరుమల కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఆగస్టు 12వ తేదీ విద్యార్థిని విద్యార్థులతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని కూడా అదే తరహాలో విజయవంతం చేయాలన్నారు. టీటీడీ కళాశాలల, ఎన్ఎస్ఎస్, ఎన్ సిసి, ఇతర విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మొదటి, రెండవ ఘాట్ రోడ్లు, రెండు నడకదారులను ఏడు సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టారుకు ప్రత్యేకాధికారిని నియమించాలని ఆమె ఆదేశించారు. హెల్త్, ఫారెస్ట్, విజిలెన్స్ విభాగాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ఆహారం, టి, స్నాక్స్ ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ళు తిరుపతి అన్నదానం విభాగంతో సమన్వయం చేసుకుని ఏర్పాటు చేయాలన్నారు. చెత్త వేసే కవర్లు, డస్ట్ బిన్లు, డిస్పోజల్ మాస్కులు, పరకలు, గ్లౌజులు సిద్ధం చేయాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. సీఎంఓ మెడికల్ టీం ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు . డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి, కళాశాలల ప్రిన్సిపాళ్ళు , ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
Next Story