Sun Dec 22 2024 21:11:14 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. నేడు నవంబర్ కోటా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయింది.
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్త జంటలతో పాటు వారి బంధువులు కూడా అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈరోజు ఆన్ లైన్ లో టీటీడీ నవంబర్ నెల దర్శనం టిక్కెట్లను విడుదల చేయనుంది. ఉదయం పది గంటలకు మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. మధ్యాహ్నం మూడు గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేస్తామని తెలిపింది. క్యూ లైన్ లు నిండిపోవడంతో భక్తులకు అన్న ప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
31 కంపార్ట్మెంట్లలో...
శనివారం నాడు భక్తుల రద్దీ సహజంగా ఎక్కువగా ఉంటుంది. శనివారం వెంకటేశ్వరస్వామికి ఇష్టమైన రోజుగా భక్తులు భావిస్తారు. అందుకే ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయంలో పూర్తవుతుందని తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 69,098 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,707 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.56 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story