Fri Apr 04 2025 08:16:10 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు ఆదివారం రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో నేడు ఆదివారం రద్దీ తక్కువగా ఉంది

తిరుమలలో నేడు ఆదివారం రద్దీ తక్కువగా ఉంది. ఆదివారం అంటే సహజంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు. అయితే తిరుమలకు మాత్రం ఈరోజు మాత్రం భక్తుల రద్దీ అంతగా లేదు. స్వామి వారిని నేరుగా దర్శనం చేసుకునే వీలుండటంతో ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు భక్తులు ఆనందపడిపోతున్నారు. తిరుమలలో వెంకటేశ్వరస్వామి చెంత ఎక్కువ సేపు చూసే భాగ్యము కలిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కంపార్ట్ మెంట్లలో పెద్దగా వేచి ఉండకుండానే భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
స్థానికులకు టోకెన్లు...
ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమలకు స్థానికులకు దర్శనం అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించిన నేపథ్యంలో నేడు దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలోనూ, బాలాజీ నగర్ కమ్యునిటీ హాలు కౌంటర్ లోనూ ఈ టోకెన్లు జారీ చేయనున్నారు. తొలుత వచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆధార్ కార్డు చూపించి స్థానికతను నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే టోకెన్లను జారీ చేయనున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు ఖాళీగా ఉన్నాయి. భక్తులు నేరుగా స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,785 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,481 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.84 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story