Fri Nov 22 2024 17:07:52 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala Laddu Controversy : ధర్మారెడ్డి రావయ్యా బాబూ.. ఎక్కడున్నావ్ నాయనా?
తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. గతంలో పనిచేసిన ధర్మారెడ్డి మాత్రం మౌనంగా ఉంటున్నారు
తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. అధికార కూటమి ప్రభుత్వం దూకుడుగా తిరుమల లడ్డూ వివాదాన్ని ప్రతి రోజూ లాగుతూనే ఉంది. హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారంటూ చంద్రబాబు ప్రతి రోజూ మీడియా సమావేశం పెట్టి మరీ తూర్పారపడుతున్నారు. తిరుమల లడ్డూలో జంతువుల నూనెను కలిపి తీవ్ర అపచారం చేశారంటూ ఈరోజు ఆలయంలో మహా శాంతి యాగాన్ని కూడా నిర్వహించారు. తిరుమలలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ నేరానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంది.
పెదవి విప్పకుండా...
అయితే ఈ వివాదానికి ప్రధాన కారణమైన అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి మాత్రం నోరు మెదపడం లేదు. గత కొద్ది రోజులుగా ఈ వివాదం నడుస్తున్నప్పటికీ ఆయన మాత్రం బయటకు రాలేదు. అన్ని రాజకీయ విమర్శలే వస్తున్నాయి. కనీసం టీటీడీ ఈవో శ్యామల రావు మీడియా సమావేశం పెట్టి ఇదీ నిజం అంటూ వివరించినప్పుడు కూడా తన హయాంలో ఏం జరిగిందన్న దానిపై ధర్మారెడ్డి పెదవి విప్పక పోవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుంది. కేవలం జగన్, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరెడ్డిలు మాత్రమే స్పందిస్తే సరిపోతుందా? అసలు ఏఆర్ డెయిరీస్ కు కాంట్రాక్టుకు ఇచ్చింది ధర్మారెడ్డి హయాంలోనే కదా? అన్న ప్రశ్నకు ఆయన మాత్రం ఎక్కడా స్పందించడం లేదు.
ఎక్కువ సమయం...
చంద్రబాబు నాయుడు ధర్మారెడ్డి మీద కూడా ఆరోపణలు చేశారు. ఆయన కుమారుడు చనిపోతే తిరుమల కొండకు వచ్చి అపచారం చేశారంటూ సీఎం ధ్వజమెత్తారు. కానీ ధర్మారెడ్డి జాడ మాత్రం లేదు. ధర్మారెడ్డి ఇంత రచ్చ జరుగుతున్నా బయటకు రాకపోవడానికి మాత్రం కారణాలు తెలియడం లేదు. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ కు చెందిన ధర్మారెడ్డిని జగన్ ఏరికోరి టీటీడీ ఈవోగా నియమించారు. ఎక్కువ సమయం ఈవోగా ఆయనే తిరుమలలో ఉన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే ధర్మారెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. కానీ ఎక్కడ ఉన్నారో మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం వస్తున్న విమర్శలకు ఆయన చెక్ పెట్టలేక మౌనం వహించారా? లేక ఈ రాజకీయ రొచ్చులో తాను ఇరుక్కోలేక కామ్ గా ఉండిపోయారో తెలియదు కానీ, ఇప్పుడు ధర్మారెడ్డి ఎక్కడ? అనే చర్చ మాత్రం జోరుగా జరుగుతుంది. మరి ధర్మారెడ్డి ఎప్పటికైనా పెదవి విప్పుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story