Wed Oct 30 2024 09:17:54 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ వివాదం కథ ముగిసినట్లేనా? కథ కొండకేనా?
తిరుమల లడ్డూ వివాదం తేలటట్లు కనిపించడం లేదు. విచారణ ముందుకు సాగడం లేదు
తిరుమల లడ్డూ వివాదం తేలటట్లు కనిపించడం లేదు. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని పెద్దయెత్తున ఆరోపణలు వినిపించాయి. నూనెలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం చర్చనీయాంశమైంది. రాజకీయంగా కూడా రగులుకుంది. తిరుమలలో లడ్డూ తయారీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కల్తీకి బాధ్యులను శిక్షించాలంటూ హిందూ సంఘాలు నినదించాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తులు మనోవేదనకు గురయ్యారు. ఈ లడ్డూ వివాదంతో రాజకీయంగానే కాదు.. సంప్రదాయాలు, సంస్కృతి పరంగా కూడా వివాదాలు తలెత్తాయి.
సనాతన ధర్మ దీక్ష చేపట్టి...
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అయితే లడ్డూ వివాదంపై ఆయన సనాతన ధర్మ దీక్ష చేపట్టారు. తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి అందరినీ తూర్పారబట్టారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని మెట్లను శుభ్రపర్చారు. చాలా సీన్ క్రియేట్ చేశారు. రచ్చ రచ్చ అయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు సయితం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని చెప్పారు. భక్తుల నుంచి ఫిర్యాదులు కూడా వచ్చాయని చంద్రబాబు చెప్పారు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు వైసీపీ నేతలు. సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. దీని వరకూ అందరికీ తెలిసిందే.
ఇప్పటి వరకూ...
అయితే ఇప్పటి వరకూ దానిపై ఎటూ తేల్చకుండా వదిలేశారు. ఆరోపణలు చేసి వదిలేసుకున్నంత మాత్రాన, విమర్శలు చేసి వదిలేసినంత సులువుగా భక్తుల మనోభావాలు తిరిగి పూర్వ స్థితికి చేరలేదన్నది వాస్తవం. ఎందుకంటే తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడికీ లడ్డూ కొనుగోలు చేసినప్పుడల్లా ఆ వివాదమే గుర్తుకు వస్తుంది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విచారణ ఇంత వరకూ చేపట్టలేదు. తిరుమలకు వచ్చే భక్తులే కాదు.. కోట్లాది మంది భక్తులకు సంబంధించిన విషయం కావడంతో కొంత సెన్సిటివ్ విషయమైనా దానిని తేల్చాల్సిన అవసరం ఉంది. నెలలు గడుస్తున్నా తేల్చకపోతే కోట్లాది మంది భక్తుల మనసులో తలెత్తిన సందేహాలకు ఎవరు తెరదించాల్సి ఉంటుంది. వారి సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత వ్యవస్థలోని అందరికీ ఉంది. లేకపోతే తిరుమల లడ్డూ వివాదం ఇక కంచికి చేరినట్లేనని అనుకోవాల్సి ఉంటుంది.
Next Story