Thu Dec 19 2024 18:52:36 GMT+0000 (Coordinated Universal Time)
Tiruamala : తిరుమల లడ్డూ వివాదంపై విచారణ ఎప్పుడు? ఇంకా ప్రారంభం కాలేదే?
తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది, అయితే నేటి వరకూ విచారణ ప్రారంభం కాలేదు
తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమిళనాడులోని ఏఆర్ డెయిరీపై కేసు కూడా నమోదు చేసింది. అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదానికి కొంత తెరపడింది. సుప్రీంకోర్టు సీబీఐతో పాటు రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ కు చెందిన నిపుణులు కూడా సభ్యులుగా ఉండేలా చూడాలని ధర్మాసనం ఆదేశించింది.
విచారణను ప్రారంభించక...
అయితే ఇంత వరకూ తిరుమల లడ్డూ వివాదంపై ప్రత్యేక ద్యర్యాప్తు సంస్థ విచారణను ప్రారంభించలేదు. బ్రహ్మోత్సవాలు ఉండటంతో అవి ముగిసిన తర్వాత విచారణ జరుపుతారని భావించారు. బ్రహ్మోత్సవాలు ముగిసి వారంరోజులు గడుస్తున్నప్పటికీ విచారణ స్టార్ట్ చేయకపోవడంపై ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తిరుమల లడ్డూ వివాదం ఏరకమైన మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ ఇటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ నెలకొంది. కానీ విచారణకు సుప్రీంకోర్టు నిర్దేశిత సమయాన్ని కేటాయించకపోవడం, నివేదికను తమకే ఇవ్వాలని ఆదేశించడంతో విచారణలో జాప్యం జరుగుతుందని భావిస్తున్నారు. భారీ వర్షాలు, తుపాను హెచ్చరికలతో విచారణ మరికొంత కాలం వాయిదా పడే అవకాశాలున్నాయి.
ప్రత్యేక దర్యాప్తు బృందం...
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ నుంచి వివరాలను ముందుగా సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత తిరుమలలో పర్యటించాల్సి ఉంటుంది. తిరుమలలో ఉన్నతాధికారుల నుంచి పోటులో పనిచేస్తున్న సిబ్బందిని కూడా విచారించాల్సి ఉంది. సీబీఐ నుంచి నియమితులైన అధికారి నేతృత్వంలోనే ఈ విచారణ సాగనుంది. అలాంటి సమయంలో ఇంకా విచారణ ప్రారంభం కాకపోవడం, ఎప్పుడు నివేదిక ఇస్తారో తెలియకపోవడం వంటి అంశాలతో ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. స్వతంత్ర దర్యాప్తు చేయాల్సిన ఉద్దేశ్యంతో ధర్మాసనం ఈ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అసలు కల్తీ జరిగిందా? కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా? అన్నది తేల్చడం వల్లనే భక్తుల మనోభావాలు ఆధారపడి ఉంటాయని నమ్ముతున్నారు. మరి విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఎవరు చెప్పాలి?
Next Story