Sat Nov 16 2024 04:42:16 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala Ladddu : తిరుమల లడ్డూ పై వివాదం... ఇందులో కూడా రాజకీయమేనా?
తిరుమల లడ్డూ రాజకీయాలకు వేదికగా మారింది. దానిపై కౌంటర్లు, ప్రతి కౌంటర్లు నేతల నుంచి వస్తున్నాయి
రాజకీయ నేతలు ఏ అంశాన్ని తేలిగ్గా వదలరు. అందులోనూ ఓటర్ల మనోభావాలపై ప్రభావం చూపే ప్రతి అంశాన్ని చూపుతుంది. ప్రధానంగా తిరుమలకు ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. హిందువులతో పాటు అనేకమంది తిరుమల వెంకటేశ్వరుడిని తమ ఇంటి దేవుడిగా భావిస్తారు. అందుకే రాజకీయాలకు తిరుమల వేదికగా మారింది. రాజకీయ రగడకు చిరునామాగా మారుతుంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో తిరుమల వివాదం మళ్లీ వెలుగులోకి వచ్చింది. తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వంలో తయారు చేసిన లడ్డూలో జంతువుల నూనెను కలపారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
వైవీ ఛాలెంజ్...
అయితే దీనిపై వైసీపీ నేత, మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. అలాంటి ఘటనలు జరిగి ఉంటే తాము కుటుంబ సభ్యుల మొత్తం ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు తిరుమల లడ్డూపై విషప్రచారానికి దిగారంటూ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తమ హయాంలో ఏం జరిగిందన్న దానిపై అవసరమైతే విచారణ జరిపించుకోవచ్చని, ప్రభుత్వం అధికారంలో ఉంది మీరే కదా? అంటూ ప్రశ్నించారు. తమ కుటుంబం హిందూ మతవిశ్వాసాలతో పాటు భక్తి శ్రద్ధలకు నిలయమని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. దీనికి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తిరుమలను ఐదేళ్ల పాటు భ్రష్టుపట్టించింది మీరు కాదా? చంద్రబాబు అన్న దానిలో నిజముందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
వారేం చేస్తున్నారు?
నిజానికి తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనెను వాడుతుంటే దాని తయారుదారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. తిరుమలలో లడ్డూలను తయారు చేసేది తిరుమలలోనే. అందుకు కూడా అత్యాధునికమైన వంట శాలను కూడా ఏర్పాటు చేశారు. నేతిని కాకుండా జంతువుల నూనెను అందులో వేస్తే తయారీదారులు ఎందుకు ఊరుకుంటారన్న ప్రశ్న వైసీపీ నేతల నుంచి వస్తుంది. మరోవైపు హిందూ మనోభావాలు దెబ్బతీసేవిధంగా, తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా వైసీపీ, టీడీపీ ప్రయత్నిస్తున్నాయంటూ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని చంద్రబాబుకు షర్మిల సవాల్ విసిరారు. ఒకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నించవద్దంటూ రెండు పార్టీలకూ షర్మిల హితవు పలికారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు.
Next Story