Mon Dec 23 2024 13:13:51 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమలలో మంగళవారం నాడు భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి.. క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ
తిరుమలలో మంగళవారం నాడు భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి.. క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ వ్యాపించింది. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 66,077 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.30 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 29,193 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం ప్రారంభమైంది. అంతకుముందు శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో కలశ స్థాపన, కలశ పూజ, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత సేకరించిన పుట్టమన్నుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాతుర్మాస సంకల్పం స్వీకరించారు. అనంతరం శ్రీ పెద్దజీయర్ స్వామి తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయర్ స్వామి, ఇతర శిష్యబృందంతో శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్చాట్ వస్త్రాన్ని, శ్రీ చిన్నజీయంగారికి నూలుచాట్ వస్త్రాన్ని బహూకరించారు. అనంతరం శ్రీపెద్దజీయర్ మఠంలో శ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీ చిన్నజీయర్‌స్వామి కలిసి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో బాల్ రెడ్డి, పేష్కర్ శ్రీహరిలను శాలువతో సన్మానించారు.
Next Story