Sun Nov 17 2024 18:41:37 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల ఘాట్‌రోడ్లపై ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాల నివారణకు టీటీడీ బుధవారం శాంతి హోమం నిర్వహించింది.
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. గురువారం నాడు టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 78,487 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 38,213 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
తిరుమల ఘాట్‌రోడ్లపై ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాల నివారణకు టీటీడీ బుధవారం శాంతి హోమం నిర్వహించింది. ప్రమాదాల నివారణకు శ్రీవారి ఆశీస్సులు కోరుతూ వైఖానస ఆగమంలో పేర్కొన్న విధంగా డౌన్‌ఘాట్ రోడ్డులోని ఏడో మైలు ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద మహా శాంతి హోమాన్ని నిర్వహించారు. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ ఇటీవల ఘాట్‌రోడ్లలో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయని.. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తులకు పెద్దగా గాయాలు లేకుండా బయటపడినట్లు తెలిపారు.ఘాట్ రోడ్డు ప్రమాదాలను ఎలా అధిగమించాలనే అంశంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్టీసీ ఆర్ఎంలతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. భక్తుల భద్రత కోసం వేంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోరుతూ హోమం నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహాదారుల సూచన మేరకు హోమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ట, విశేష హోమంలతో మహా శాంతి హోమంతో ప్రారంభమై మహా పూర్ణాహుతితో ముగిసిందన్నారు.
Next Story