Mon Dec 23 2024 16:56:39 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారిని 92,238 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 40,400 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం జూన్ 29న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
త్వరలో వాచీల వేలం:
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను జూన్ 22న టెండర్ కమ్ వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి. కొత్తవి, ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 10 లాట్లు ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో కానీ, టీటీడీ వెబ్సైట్ www.tirumala.org ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
Next Story