Mon Dec 23 2024 16:11:05 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
తిరుమలలో మంగళవారం నాడు భక్తుల రద్దీ బాగా పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు
తిరుమలలో మంగళవారం నాడు భక్తుల రద్దీ బాగా పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 76,555 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.75 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,488 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలలో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలు ఉన్నాయి:
– సెప్టెంబరు 7న గోకులాష్టమి.
– సెప్టెంబరు 8న ఉట్లోత్సవం.
– సెప్టెంబరు 17న బలరామ జయంతి, వరాహ జయంతి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
– సెప్టెంబరు 18న వినాయక చవితి, ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
– సెప్టెంబరు 22న శ్రీవారి గరుడసేవ.
– సెప్టెంబరు 23న శ్రీవారి స్వర్ణరథోత్సవం.
– సెప్టెంబరు 25న రథోత్సవం.
– సెప్టెంబరు 26న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమాప్తి.
– సెప్టెంబరు 27న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం.
– సెప్టెంబరు 28న అనంత పద్మనాభ వ్రతం
నేటి నుండి తాళ్లపాకలో శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు:
అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు సెప్టెంబరు 5 నుండి 7వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 5వ తేదీ సాయంత్రం పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, గ్రంధి పవిత్ర పూజ నిర్వహిస్తారు. సెప్టెంబరు 6న యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, లఘు పూర్ణాహుతి చేపడతారు. సెప్టెంబరు 7న పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Next Story