Fri Jan 10 2025 12:18:41 GMT+0000 (Coordinated Universal Time)
Ttd Board : టీటీడీ బోర్డు నియామకంపై చంద్రబాబు వెనకడుగు వేస్తుంది.. అందుకేనా?
టీటీడీ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కసరత్తులు చేశారు
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కసరత్తులు చేశారు. అయినా ఇంకా ప్రకటన మాత్రం వెలువడలేదు. మరోవైపు బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమయి మూడు రోజులవుతుంది. ఈసారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ బోర్డు లేకుండానే బ్రహ్మోత్సవాలు ముగిసే అవకాశముంది. ఎందుకింత జాప్యం జరుగుతున్నట్లు అనేది చంద్రబాబు మినహా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అన్ని రకాలుగా ఆలోచించి ఎలాంటి విమర్శలు రాకుండా ఈసారి టీటీడీ బోర్డును ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. అందుకే ఆయన ఆచితూచి కమిటీ ఏర్పాటు విషయంలో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చినా...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపై చంద్రబాబు అనేకరోజుల నుంచి కసరత్తులు చేశారు. అందుకు సంబంధించిన పేర్లు కొన్ని ప్రచారంలోకి వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన ఒక టీవీ మీడియా అధినేత పేరు వినిపించింది. సభ్యుల పేర్లు కూడా కొన్ని ప్రస్తావనకు వచ్చాయి. అయితే అవేమీ నిజం కావని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. బోర్డు ఛైర్మన్ పదవిపైనే ఇన్నాళ్లూ చంద్రబాబు నాయుడు కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. ఎవరూ విమర్శలు చేయకుండా, ఎవరి నోటి నుంచి తన నిర్ణయాన్ని తప్పుగా అనకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకే బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాతనే టీటీడీ బోర్డు నియమించే అవకాశముంది.
లడ్డూ వివాదంతో...
వాస్తవానికి టీటీడీ బోర్డు బ్రహ్మోత్సవాలకు ముందే నియమించాల్సి ఉంది. అయితే ఈ మధ్యకాలంలో తిరుమల లడ్డూ వివాదం బయటకు రావడంతో వాయిదా వేయక తప్పింది కాదు. లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ విచారణ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. అందుకే బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును నియమించే అవకాశాలున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దల సిఫార్సులను కూడా చంద్రబాబు పరిగణనలోకి తీసుకోనున్నారు. రేపు ఢిల్లీలో కేంద్రం పెద్దలతో మాట్లాడి వచ్చిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. మొత్తం మీద టీటీడీ బోర్డు ప్రకటన మాత్రం ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు.
Next Story