Sun Dec 22 2024 21:18:43 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలకు వెళ్తున్నారా.. ఈ విషయంలో జాగ్రత్త
తిరుమలను పొగమంచు కప్పివేసింది. ఓవైపు పొగమంచు.. మరో వైపు వర్షం కారణంగా పాపవినాశనం
తిరుమలను పొగమంచు కప్పివేసింది. ఓవైపు పొగమంచు.. మరో వైపు వర్షం కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను టీటీడీ మూసివేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆ మార్గాల్లో వాహనాల రాకపోకలను టీటీడీ పూర్తిగా నిలిపివేసింది. శుక్రవారం పొగమంచుతో రోడ్డు సరిగా కనిపించడం లేదు.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. టీటీడీ సిబ్బంది అలిపిరి మార్గంలో వెళ్లే వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. పొగమంచు కురుస్తుండటంతో ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచిస్తోంది.. ముందు వెళ్లే వాహనాలను చూసుకుని నిదానంగా ప్రయాణం కొనసాగించాలని సూచనలు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో ప్రతి రోజు 100 ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా.. డిసెంబరు 16వ తేదీ నుంచి విమానాశ్రయంకు బదులుగా తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేస్తారు. ప్రతి రోజు 100 టికెట్లను బోర్డింగ్ పాస్ సమర్పించిన భక్తులకు యధావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్లైన్ టికెట్లను ఇస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామి వారిని 71,037 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,635 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. శ్రీవారి హుండి ఆదాయం 3.89 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story