Tue Nov 05 2024 16:26:54 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?
4 రోజులు వరుస సెలవులు రావడంతో తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. విపరీతమైన భక్తుల రద్దీ నెలకొంది.
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 వరకు సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత నిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సెలవులు, పెళ్లి ముహూర్తాల వల్ల కొండపై భక్తుల రద్దీ పెరిగిందని.. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
4 రోజులు వరుస సెలవులు రావడంతో తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. విపరీతమైన భక్తుల రద్దీ నెలకొంది. ప్రస్తుతం క్యూ లైన్ రింగ్ రోడ్డు దాటింది. దర్శనానికి 2 రోజుల సమయం పట్టేట్టు ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లు అన్ని నిండి క్యూ లైన్ వెలుపలకు వ్యాపించింది. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా భక్తులు నిండి పోవడంతో ఏటిసి మీదుగా ఎస్ఎన్సి , లేపాక్షి సర్కిల్, షాపింగ్ కాంప్లెక్సు, పాత అన్నదానం మీదుగా ఆస్థానం మండపం గుండా వరాహస్వామి అతిథిగృహంను దాటి శ్రీవారి సేవా సదన్ వద్దుకు క్యూ లైన్ వ్యాపించింది. స్వామివారి దర్శనం కోసం దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో వేచివున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లో వేచివున్న భక్తులు అన్నప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు నీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.
Next Story