Sun Mar 30 2025 03:50:05 GMT+0000 (Coordinated Universal Time)
TDP : కొలికపూడిని వదిలంచుకోవడమే మంచిదా? అదే నిర్ణయానికి వచ్చినట్లుందిగా
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును క్రమశిక్షణ కమిటీకి రావాలంటూ ఆదేశించింది.

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును క్రమశిక్షణ కమిటీకి రావాలంటూ ఆదేశించింది. ఇటీవల ఎస్టీ మహిళ ఆత్మహత్య యత్నం చేయడంతో మరోసారి ఆయన వార్తల్లోకెక్కారు. గతంలో పలుమార్లు అధినాయకత్వం హెచ్చరించినా పెడచివిన పెడుతున్న కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని తిరువూరు టీడీపీ నేతలు కోరుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా కొలికపూడి శ్రీనివాసరావు పదే పదే వివాదాల్లో చిక్కుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రేపు క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి శ్రీనివాసరావు హాజరు కానున్నారు. జరిగిన ఘటనపై కమిటీకి వివరణ ఇచ్చుకోనున్నారని తెలిసింది.
స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారా?
ఈసారి కొలికపూడి శ్రీనివాసరావుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని, అప్పటికీ వ్యవహారశైలిలో మార్పు రాకుంటే చర్యలు తీసుకునే దిశగా టీడీపీ అధినాయకత్వం అడుగులు కనపడుతున్నాయి. కమ్మ సామాజికవర్గాన్ని బహిరంగంగా దూషించడమే కాకుండా, తరచూ పార్టీకి తలనొప్పులు తెస్తున్న కొలికపూడి వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. అయితే రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారన్న ఏకైక సాఫ్ట్ కార్నర్ ఆయన పట్ల ఒకింత ఉండటంతో ఇప్పటి వరకూ వేచి చూశారని, ఇలా సొంత పార్టీకి తలనొప్పిగా మారిన కొలికపూడిని ఉపేక్షించడం మంచిది కాదన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది.
రేపు క్రమశిక్షణ కమిటీ ఎదుటకు...
ప్రతి విషయానికి కొంత ఓర్పు ఉంటుందని, దానిని తరచూ పరీక్షిస్తుంటే చర్యలు తప్పవన్న హెచ్చరికలను బలంగా పార్టీ నేతలకు పంపాలని చంద్రబాబు క్రమశిక్షణ కమిటీకి చెప్పినట్లు తెలిసింది. స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వండి. మారతారా? లేదో? కనుక్కోండి? అతని సమాధానం బట్టి చర్యలు తీసుకోవాలని కూడా కమిటీ సభ్యులకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. దీంతో కొలికపూడిపై చర్యలు ఉంటాయని తిరువూరు టీడీపీ నేతలు చెబుతున్నారు. పదే పదే వివాదాల్లో చిక్కుకుంటూ పార్టీతో పాటు నాయకులకు కూడా తలనొప్పిగా మారిన కొలికపూడిని వదిలించుకుంటారా? ఫైనల్ వార్నింగ్ ఇచ్చి మరొక ఛాన్స్ ఇస్తారా? అన్నది రేపు తెలియనుంది.
Next Story