Mon Mar 31 2025 20:11:46 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ సోషల్ మీడియా మళ్లీ ఆన్
ఏ పార్టీకి అయినా సోషల్ మీడియా వింగ్ బలంగా ఉంటేనే నేడు జనంలోకి సులువుగా వెళుతుంది.

ఏ పార్టీకి అయినా సోషల్ మీడియా వింగ్ బలంగా ఉంటేనే నేడు జనంలోకి సులువుగా వెళుతుంది. అది నిజాలైనా, అబద్ధాలనైనా సులువుగా జనాలకు చేరవేస్తుంది. సామాజిక మాధ్యమాల రోజులు కాబట్టి ఈరోజుల్లో సోషల్ మీడియా ఎంత బలంగా ఉంటే అంత పార్టీకి ప్లస్ అవుతుంది. ప్రధాన మీడియా కొంత ప్రజలను చైతన్య వంతుల్ని చేస్తున్నప్పటికీ, అదే సమయంలో సోషల్ మీడియాలో చైతన్యం తేవడానికి, తప్పుదోవ పట్టించడానికి కూడా కారణమవుతుంది. అందుకే ప్రతి పార్టీ సోషల్ మీడియా వింగ్ బలంగా ఉండాలని కోరుకుంటుంది. ప్రతిపక్షాలకు ధీటైన విమర్శలు చేయాలని అధికార పక్షం, అధికార పక్షం తప్పులను ఎత్తి చూపేందుకు విపక్షం సోషల్ మీడియానే ఉపయోగించుకుంటుంది.
బలంగా ఉన్న టీడీపీ...
నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ బలంగా ఉండేది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారానే నిలదీస్తున్నారు. కూటమి పార్టీలో లుకలుకలు వారే బయటపెడుతున్నారు. ఉచిత ఇసుక విధానంలో లొసుగులను కూడా వారే బాహ్య ప్రపంచానికి చెబుతున్నారు. ఇక చంద్రబాబు నిర్ణయాలపై కూడా నేరుగా సోషల్ మీడియా ద్వారానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయి జైలులో యాభై రెండు రోజులు ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. దాని వల్లనే ప్రపంచ వ్యాప్తంగా అరవై దేశాల్లో చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా తెలుగు ప్రజలు ఆందోళనకు దిగారనడంలో అతి శయోక్తి లేదు.
ఓటమి తర్వాత...
ఇక 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ సోషల్ మీడియా డల్ అయింది. అయితే మళ్లీ యాక్టివ్ గా కనిపిస్తుంది. వైసీపీ సామాజికమాధ్యమాల ద్వారానే తమ అభిప్రాయాలను ప్రజలకు తెలియజెబుతుంది. లైలా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సినీనటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ పై ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ దెబ్బకు కలెక్షన్లే పడిపోయాయని చెప్పకతప్పదు. హ్యాష్ ట్యాగ్ ద్వారా వేలాది మంది స్పందించి బాయ్ కాట్ లైలా అంటూ నినదించారు. ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కూడా వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా అక్రమ అరెస్ట్ లంటూ పెద్దయెత్తున క్యాంపెయిన్ ప్రారంభించింది. మొత్తం మీద నేతలు యాక్టివ్ గా లేకపోయినా సోషల్ మీడియా మళ్లీ రైజ్ కావడంతో వైసీపీకి కొంత ఊపిరి వచ్చినట్లయింది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ మొదలయింది.
Next Story