Mon Dec 23 2024 23:09:14 GMT+0000 (Coordinated Universal Time)
భారీగా తగ్గిన టమాటా ధరలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
కొన్ని వారాలుగా ఆకాశాన్నంటుతూ పెరిగిన టమాటా ధరలు.. నేడు భారీగా పడిపోయాయి.
కొన్ని వారాలుగా ఆకాశాన్నంటుతూ పెరిగిన టమాటా ధరలు.. నేడు భారీగా పడిపోయాయి. సామాన్యుడిగా అందుబాటులో టమోటా ధరలు దిగొచ్చాయి. సగటు మధ్యతరగతి వారికి ఇది సంబరపడిపోయే విషయం. కానీ.. నిన్న మొన్నటి వరకూ కిలో రూ.70 నుంచి రూ.100 వరకూ పలికిన టమోటా ధరలు.. తీరా పంట చేతికొచ్చే సమయానికి సగానికి సగం పడిపోవడంతో టమోటా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లోని రైతుమార్కెట్లలో నేటి టమోటా ధరలు రూ.35 నుంచి రూ.50 లుగా ఉన్నాయి.
మార్కెట్ కు తీసుకొచ్చేసరికి...
ఏపీలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ముఖ్యంగా మదనపల్లిలో టమోటా ను ఎక్కువ పండిస్తారు రైతులు. వాతావరణం అనుకూలించి.. దేవుడు కరుణిస్తే ఓకే. కానీ.. మూడేళ్లుగా ఈ ప్రాంతాల్లో టమోటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధిక వర్షాలతో వరదలు వచ్చి పంట పాడవ్వడం, పంట చేతికొచ్చే సమయానికి పెరిగిన టమోటా ధరలు అమాంతం పడిపోవడం.. మూడు సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. కష్టనష్టాలకు ఓర్చి టమోటా సాగు చేస్తే.. తీరా మార్కెట్ కు పంటను తీసుకొచ్చేసరికి ధరలు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
కమిషన్ వ్యాపారులు మాత్రం....
నందిగామ మార్కెట్లో టమోటా పంటను పండించిన తాము నష్టపోతుంటే.. కమిషన్ వ్యాపారులు తమ కష్టాన్ని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని రైతులు వాపోతున్నారు. పండించిన తాము నష్టపోతుంటే, ఇతర ప్రాంతాల నుంచి టమోటా దిగుమతి చేసుకుని రైతు బజార్ లలో కమీషన్ పద్దతిపై వ్యాపారం చేసే కమీషన్ దారులు కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. చాలా కాలంగా నందిగామ రైతు మార్కెట్లో ఇదే పద్దతి కొన్న సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో దళారుల ప్రమేయం పై చర్యలు తీసుకొని, స్థానిక రైతులు పండించే టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ప్రాంత టమోటా రైతులు కోరుతున్నారు.
Next Story