Thu Nov 14 2024 16:51:50 GMT+0000 (Coordinated Universal Time)
రేపు ఏం జరగనుందో.. అందరిలోనూ అదే టెన్షన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేసి రేపటికి నెల కావస్తుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేసి రేపటికి నెల కావస్తుంది. నెల రోజుల నుంచి ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగానే ఉంటున్నారు. ఆయన బెయిల్ ప్రయత్నాలు ఏవీ ఇప్పటి వరకూ ఫలించలేదు. క్వాష్ పిటీషన్ ను కూడా హైకోర్టులో కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నెల రోజుల నుంచి పార్టీ అధినేత జైలులో ఉండటంతో పార్టీ క్యాడర్ లోనూ నైరాశ్యం అలుముకుంది.
నెల రోజులు దాటి...
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో గత నెలలో తేదీన ఆయన నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో తొలిసారి జైలు గోడల మధ్య ఉన్నారు. ఇన్ని రోజులు ఉంటారని ఏ ఒక్కరూ ఊహించలేదు. అరెస్టయినా వెంటనే బెయిల్‌పై వస్తారని టీడీపీ శ్రేణులు వేసుకున్న అంచనాలు తిరగబడ్డాయి. ఇప్పటి వరకూ బెయిల్ ఊసే లేదు. కాకపోతే ఆయనకు ఇంటి నుంచి భోజనం, మందులకు అనుమతించం కొంత ఊరట కల్గించే అంశం.
అనేక కేసులు...
ఇక రేపు చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా కీలకమనే చెప్పాలి. సుప్రీంకోర్టులో రేపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై విచారణ జరగనుంది. ఇందులో తమకు న్యాయం జరుగుతుందని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. తమ బాస్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఏసీబీ కోర్టులో ఇదే కేసులో బెయిల్ పిటీషన్‌పై కూడా వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయమూర్తి రేపటికి రిజర్వ్ చేశారు. బెయిల్ వస్తుందా? రాదా? అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మరోవైపు సీఐడీ వేసిన కస్టడీ పిటీషన్ పై కూడా విచారణ పూర్తయి తీర్పు పెండింగ్‌లో ఉంది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో కూడా తీర్పు రిజర్వ్ చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీకి రేపు అత్యంత ముఖ్యమైన రోజుగానే చూడాల్సి ఉంది.
Next Story