Tue Nov 05 2024 16:17:39 GMT+0000 (Coordinated Universal Time)
అల్లూరిలో విషాదం.. గోతిలో పడి 5వ తరగతి బాలుడు మృతి
బాలుడు ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతుకుతూ వెళ్లగా.. గోతి వద్ద బాలుడి చెప్పులు, బట్టలు కనిపించాయి.
ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నేషనల్ హైవే పనుల్లో భాగంగా తీసిన గోతిలో పడి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన హుకుంపేటలో జరిగింది. రోడ్డు పనుల కోసం తీసిన గొయ్యి.. ఇటీవల కురిసిన వర్షపు నీటితో నిండిపోయింది. నిన్న (ఏప్రిల్ 25) సాయంత్రం జ్ఞాన దీపకే అనే ఐదో తరగతి చదువుతున్న బాలుడు ఆ గోతిలోకి ఈత కొట్టేందుకు దిగాడు. లోతు ఎంత ఉందో తెలియకుండా దిగడంతో.. బాలుడు గోతిలో మునిగిపోయాడు.
బాలుడు ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతుకుతూ వెళ్లగా.. గోతి వద్ద బాలుడి చెప్పులు, బట్టలు కనిపించాయి. దాంతో స్థానికులు ఆ గోతిలోనే బాలుడు పడి ఉంటాడని భావించి వెతకడంతో మృతదేహం లభ్యమైంది. కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే తమ కొడుకు చనిపోయాడంటూ ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
Next Story