Wed Mar 26 2025 19:06:26 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఇక భారీ జరిమానాలు.. లైసెన్స్ రద్దు.. ఏపీ వాహనదారులకు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ లో వాహనదారులకు రవాణా శాఖ హెచ్చరిక జారీ చేసింది. నేటి నుంచి కొత్త మోటారు వెహికల్ చట్టం అమలు కానుంది

ఆంధ్రప్రదేశ్ లో వాహనదారులకు రవాణా శాఖ హెచ్చరిక జారీ చేసింది. నేటి నుంచి కొత్త మోటారు వెహికల్ చట్టం అమలు కానుంది. ఇకపై నిబంధనలను అతిక్రమించి రోడ్డుపైకి వస్తే భారీ జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశముందని పోలీసులు, రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పికే హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై ఏపీలో ఉక్కుపాదం మోపుతున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. హైకోర్టు సూచనల మేరకు గత కొద్ది రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
కొత్త మోటారు వాహనాల చట్టం...
ఇక ఈ రోజు నుంచి నూతన మోటారు వాహనాల చట్టం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. నిబంధనలు పాటించని వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. భారీగా జరిమానాలు విధిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. హెల్మెట్ లేకుండా నేటి నుంచి ద్విచక్రవాహనం నడిపితే వెయ్యి రూపాయల వరకూ జరిమానా విధించనున్నారు. ఫోర్ వీలర్స్ లో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాహనం నడిపితే వెయ్యిరూపాయలు జరిమానా విధించనున్నారు. దీంతో పాటు ఇక మద్యం సేవించి పట్టుబడితే మాత్రం పది వేల రూపాయల వరకూ జరిమానా విధిస్తారు.
డ్రైవింగ్ లైసెన్సును...
దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా రద్దు చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక సిగ్నల్ జంప్ అయినా, ఓవర్ స్పీడ్ అయినా, రాంగ్ రూట్ లో వచ్చిన వెయ్యి రూపాయలు జరిమానా విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఐదు వేల రూపాయల వరకూ జరిమానా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయడమే కాకుండా వాహనాలను కూడా సీజ్ చేస్తామని పోలీసులు, రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
Next Story