తిరుమలలో తెరచుకున్న వైకుంఠ ద్వారాలు
జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు
తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. ధనుర్మాసం కావడంతో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతో పాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు భక్తులు పోటెత్తారు. జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. తిరుపతిలోని కౌంటర్ల దగ్గర వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని 22న సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తున్నట్లు టీటీడీ ముందుగానే ప్రకటించింది. భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనం లైన్లో స్వామిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇక వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూలైన్లు నారాయణగిరి వద్దకు చేరుకున్నాయి.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 2.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం ఏకాంతంగా నిర్వహిస్తారు. వేకువజామున 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 6 నుండి 7 గంటల వరకు బంగారు తిరుచ్చిపై స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. డిసెంబరు 24న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 నుండి 5.30 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, ఉదయం 5.30 నుండి 7.30 గంటల వరకు తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డిసెంబరు 23, 24వ తేదీల్లో ఆర్జిత కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.