Mon Dec 23 2024 08:25:55 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో పెరుగుతున్న రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం
సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 30-40 గంటల సమయం పడుతుండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన..
వేసవి సెలవుల కారణంగా.. తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో.. వారి సౌకర్యార్థం స్వామివారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో శుక్రవారం నుండి ఆదివారం వరకు జరిగే సుప్రభాత సేవకు విచక్షణ కోటా రద్దు చేయడంతో 20 నిమిషాల సమయం ఆదా అవుతోంది. అలాగే గురువారం తిరుప్పావడ సేవను ఏకాంతంగా నిర్వహించడంతో అరగంట ఆదా అవుతోంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాల సిఫార్సు లేఖలను స్వీకరించరు. స్వయంగా వచ్చే వీఐపీలకే బ్రేక్ దర్శనాలకు అవకాశం ఉంటుంది. ఫలితంగా 3 గంటల సమయం ఆదా అవుతున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 30-40 గంటల సమయం పడుతుండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. టీటీడీ తీసుకున్న నిర్ణయానికి భక్తులు, వీఐపీలు సహకరించాలని కోరారు. జులై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు. కాగా.. నిన్న శ్రీవారిని 85,297 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి హుండీ ఆదాయం 3.71 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. దర్శనానికి సుమారు 5-6 గంటలు, టోకెన్లు లేని భక్తులకు 12 గంటల సమయం పడుతుందని తెలిపారు.
Next Story