Thu Dec 19 2024 15:42:21 GMT+0000 (Coordinated Universal Time)
నిరుద్యోగుల ఒత్తిడి.. దంపతుల ఆత్మహత్య
స్మార్ట్ విలేజ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కవిటి కేంద్రంగా ఉన్న సంస్థలో వీరిద్దరూ..
నిరుద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక.. పరువు పోతుందన్న భయంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ నగరంలోని కొమ్మాదిలో శివశక్తి కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంవీకే ప్రసాద్ (54), రాజరాజేశ్వరి(50) భార్యభర్తలు. స్మార్ట్ విలేజ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కవిటి కేంద్రంగా ఉన్న సంస్థలో వీరిద్దరూ ప్రతినిధులుగా పనిచేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి.. ముందుగా శిక్షణ, ఆ తర్వాత నియామకాలు ఉంటాయని ప్రచారం చేశారు. అయితే చెప్పిన మాట ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో.. సదరు సంస్థను నమ్మి మోస పోయామంటూ నర్సీపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో పలువురు నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖ కు ప్రతినిధులుగా ఉన్న ఎంవీకే ప్రసాద్, రాజేశ్వరి దంపతులను నమ్మి పలువురు నిరుద్యోగులు.. ఒక్కొక్కరు ఉద్యోగం వస్తుందని రూ.20 వేలు నుంచి రూ.25 వేల వరకూ డిపాజిట్ల కింద కట్టారు. రోజులు గడుస్తున్నా.. ఉద్యోగాల మాటలేదు కదా.. కనీసం కట్టిన డిపాజిట్లు కూడా తిరిగి చెల్లించలేదు. దాంతో బాధితులు దంపతులపై తమ డిపాజిట్లు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. నిరుద్యోగుల ఒత్తిడితో.. తమ పరువుపోయిందని మనస్తాపం చెంది ప్రసాద్, రాజేశ్వరిలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పీఎం పాలెం సీఐ వై. రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story