Tue Nov 05 2024 16:48:11 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ మళ్లీ కలుద్దామన్నారు
కేసీఆర్ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరని, ప్రజలకు కమ్యునికేట్ చేయగలరని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు
"ముఖ్యమంత్రి కేసీఆర్ పది రోజుల క్రితం ఫోన్ చేశారు. హైదరాబాద్ వస్తే కలవాలని ఫోన్ చేశారు. ఆయనతో లంచ్ మీటింగ్ కు వెళ్లాను. నా కోసం ఆయన కూడా వెజిటేరియన్ భోజనమే చేశారు. అయితే పార్టీ ఏర్పాటుపై ఆయన నాతో చర్చించలేదు. కేవలం బీజేపీ గురించే నాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్నంత బీజేపీ ఏ రాష్ట్రంలో లేదు. అన్ని పార్టీలూ ఇక్కడ బీజేపీకి మద్దతిస్తున్నాయి. బీజేపీ పై నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వారి విధానాలు దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. బీజేపీపై కేసీఆర్ ది, నాది ఒకే అభిప్రాయం.
బీజేపీకి చెక్ చెప్పడానికే....
బీజేపీకి చెక్ చెప్పడానికి ప్రతిపక్షం బలంగా ఉండాలి. ప్రతిపక్షం లేకుండా చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశ్యం. ముక్త్ అపోజిషన్ బీజేపీ నినాదంగా కన్పిస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో ఆయనను కలిశాను. బీజేపీ ప్రభుత్వంపై ఆయన చేసిన హోం వర్క్ ను చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను మాత్రం కేసీఆర్ కు తాను స్పష్టంగా చెప్పాను. రాజకీయాల్లో తాను లేనని, తనకు ఇలా ఉండటమే బాగుంటుందని చెప్పాను. బీజేపీ పై వ్యతిరేకత మీరు మాట్లాడుతున్న మాటలను కొనసాగించాలని కోరారు. మరి ఆయన నా విషయంలో ఏం ఆలోచించారో నాకు తెలియదు. మరలా కలుద్దామని చెప్పారు. కేసీఆర్ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. దేశ ప్రజలకు కమ్యునికేట్ చేయగలరు." అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.
బీజేపీ వ్యతిరేకులంతా...
బీజేపీ వ్యతిరేకులంతా కేసీఆర్ కు మద్దతివ్వాలని ఆయన అన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ దాడులు ప్రారంభించిందని ఇతర దేశాలు అభిప్రాయపడుతున్నాయన్నారు. ఇతర దేశాలు భారతీయ సంస్కృతిని అందరూ గౌరవిస్తున్నారన్నారు. మోదీ రాజులాగా భావిస్తున్నాడన్నారు. తన ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాడన్నారు. బీజేపీ అనుసరిస్తున్న లోపాలపై ప్రజలకు వివరించాలని కేసీఆర్ తనను కోరారన్నారు. కేసీఆర్ వద్ద ఒక టీం వర్క్ చేస్తున్నారని, బీజేపీ వ్యతిరేక కూటమి అంటే ఎవరూ నమ్మరని, అందుకే సొంతంగా పార్టీ పెట్టడానికి సంసిద్ధులై ఉండవచ్చని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.కేసీర్ కు జవహర్ లాల్ నెహ్రూ అంటే ఇష్టమని ఉండవల్లి తెలిపారు.
Next Story