Fri Nov 22 2024 22:37:06 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు వర్ల రామయ్యలేఖ : అత్యాచార బాధితురాలికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
మగవారిని చూస్తేనే బాధితురాలు చిగురుటాకులా వణికిపోతోందని, ఆమె మానసిక పరిస్థితిని చూస్తే.. ఎంత చిత్రవధ అనుభవించిందో..
అమరావతి : మే 1వ తేదీ అర్థరాత్రి బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో ముగ్గురు కామాంధుల చెరలో పడి.. అత్యాచారానికి గురైన బాధిత మహిళకు ప్రభుత్వం వెంటనే కోటిరూపాయలు ఆర్థిక సహాయంతో పాటు, ఐదు ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం, సొంత ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందతున్న బాధితురాలిని పరామర్శించేందుకు ప్రభుత్వ నిర్బంధాన్ని చేధించుకుని వెళ్లాల్సి వచ్చిందని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.
మగవారిని చూస్తేనే బాధితురాలు చిగురుటాకులా వణికిపోతోందని, ఆమె మానసిక పరిస్థితిని చూస్తే.. ఎంత చిత్రవధ అనుభవించిందో అర్థమవుతుందన్నారు. ప్రభుత్వం తరపున బాధితురాలికి ఆర్థిక సహాయం చేశామని చెప్తున్నా.. పరిహారం ఎక్కడిచ్చారో, ఏ రూపంలో ఇచ్చారో క్లారిటీ లేదన్నారు. రైల్వే స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశంలో మహిళపై గ్యాంగ్ రేప్ జరుగుతున్నా అక్కడి పోలీసులు పట్టించుకోకపోవడం.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో తెలుస్తుందన్నారు. ఇలాంటి అత్యాచార ఘటనల్లో బాధితురాలికి, ఆమె కుటుంబానికి భరోసా కల్పించి, నిందితుల్ని కఠినంగా శిక్షింపజేయాల్సిన హోంమంత్రి తానేటి వనిత.. తల్లిదండ్రుల పెంపకం సరిగా లేకపోవడం వల్లే అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని చెప్పడం.. వారి బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోందని వర్లరామయ్య విమర్శించారు.
రాష్ట్రంలో ఇంతవరకూ అమల్లోకి రాని దిశాచట్టం పేరుతో పెద్దఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప.. ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నట్లుగా కనిపించడం లేదన్నారు. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతి చెందిన వారికి కోటిరూపాయల పరిహారం అందించిన ప్రభుత్వం.. గ్యాంగ్ రేప్ కు గురైన మహిళకు కేవలం రూ.4.12 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అత్యంత అమానవీయమని పేర్కొన్నారు. దీనినిబట్టి ప్రభుత్వానికి మహిళల పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు. పశ్చిమ ప్రకాశం నుంచి వలస వచ్చిన మహిళ.. తిరిగి స్వగ్రామానికి వెళ్లి పనులు చేసుకుని బ్రతుకే పరిస్థితులు లేవని.. బాధితురాలికి తక్షణమే కోటి రూపాయల ఆర్థిక సాయం, 5 ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం, సొంత ఇల్లు ఇచ్చి సామాజికంగా, ఆర్థికంగా భద్రత కల్పించాలని కోరుతున్నట్లు బహిరంగ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మరోసారి ఇలాంటి ఘోర ఘటనలు రిపీట్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story