Mon Nov 18 2024 22:28:54 GMT+0000 (Coordinated Universal Time)
వేమన విగ్రహం స్థానంలో వైఎస్సార్ విగ్రహం.. యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఏమన్నారంటే
కడపలోని యోగి వేమన యూనివర్శిటీలో వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అంశం వివాదాస్పదమయింది. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ మునగాల సూర్యకళావతి మాట్లాడుతూ ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. అభివృద్ధి పనుల్లో భాగంగా విగ్రహాన్ని యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశామని.. మెయిన్ గేట్ వద్ద వేమన విగ్రహం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. యూనివర్శిటీ వ్యవస్థాపకులు దివంగత రాజశేఖరరెడ్డి కావడంతో వేమన విగ్రహం స్థానంలో ఆయన విగ్రహాన్ని పెట్టామని తెలిపారు. తాము కొత్త విగ్రహాలను తీసుకురాలేదని, ఉన్న విగ్రహాలనే మరో చోటుకు మార్చడం జరిగిందని చెప్పారు. కొత్త అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కు వైఎస్సార్ పేరు పెట్టడం వల్ల అక్కడున్న స్థలంలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ వివాదంపై జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. వేమన రాసిన ఓ పద్యాన్ని తాత్పర్యంతో పాటు పంచుకున్నారు. ఇందుకు సంబంధించి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. వేమన విగ్రహం తొలగింపునకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనం తాలూకు క్లిప్పింగ్ ను కూడా పంచుకున్నారు.
విద్యలేనివాడు విద్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం.
Next Story