Mon Dec 23 2024 14:15:17 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఫోటో పెట్టి.. పురందేశ్వరిని టార్గెట్
ఢిల్లీ సాక్షిగా కుట్రలు చేయడం మీ మరిది గారికి అలవాటేనని పురందేశ్వరిని ఉద్దేశించి
ఢిల్లీ సాక్షిగా కుట్రలు చేయడం మీ మరిది గారికి అలవాటేనని పురందేశ్వరిని ఉద్దేశించి వైసీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. కానీ ఈసారి మిమ్మల్ని తీసుకెళ్లి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి... అదీ హైలైట్ అని అన్నారు. చంద్రబాబు జీవితంలో ఎవ్వరికీ విశ్వసనీయమైన స్నేహితుడు కాలేడన్న కమ్మటి వాస్తవం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరికీ తెలుసునన్నారు. ఇంతకంటే ఆధారం కావాలా? చిన్నమ్మా! పురందేశ్వరి! పతీసమేతంగా మరిదిని తీసుకెళ్లి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఇష్టంలేకపోయినా బలవంతంగా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీకి తెలీదా, మీరంతా ఒకటేనని, అందుకే కదా దొంగ చేతికే తాళం ఇచ్చిందని విజయసాయి రెడ్డి అన్నారు.
అంతకు ముందు కూడా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పురందేశ్వరిని ఉద్దేశిస్తూ ట్వీట్లు చేశారు. ‘దివంగత నేత, మహా నటుడు ఎన్టీఆర్ ఆశయాలకు గండికొట్టారు.. సమాధి తప్ప ఆయనకు స్మారకచిహ్నమంటూ లేకుండా చేశారు.. అమ్మా పురందేశ్వరీ! ఒక్క క్షణం ఆలోచించమ్మా’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ గారు ఎంతో అభిమానించిన అబిడ్స్ ఇల్లు తన వాటాగా అందుకున్న నందమూరి రామకృష్ణ దానిని అమ్ముకున్నారని గుర్తుచేశారు. కేవలం నాలుగు కోట్లకు దానిని విజయ్ ఎలక్ట్రికల్స్ రమేశ్ కు అమ్ముకున్నారు.. వీళ్ల దగ్గర నాలుగు కోట్లు కూడా లేవా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్న చంద్రబాబు కానీ, పురంధీశ్వరి కానీ ఆ ఇంటిని కొని ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా తీర్చిదిద్దలేదేమని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. మద్రాస్ లోని ఎన్టీఆర్ ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆ మహా నటుడి మీద మీకున్న ప్రేమ ఏంటనేది తెలుస్తుందని విమర్శించారు. వాటాలు తేల్చుకోలేక దానిని పాడు పెట్టేశారని అన్నారు. బంజారాహిల్స్ లో ఆయన చివరి క్షణాలు గడిపిన ఇంటిని పడగొట్టి అపార్ట్మెంట్ లు కట్టుకుని అద్దెకిచ్చారని అన్నారు. దానికి ఎదురుగా ఉన్న మరో ఇంట్లో మ్యూజియం పెట్టాలని ఎన్టీఆర్ భావించగా.. ఆయన ఆశయాన్ని గౌరవించి, దానిని మ్యూజియంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీకు లేదా? అని ప్రశ్నించారు. సమాధి తప్ప ఆయనకు స్మారకచిహ్నం కూడా లేకుండా చేసి ఇప్పుడు 100 రూపాయల నాణెం అంటూ మురిసిపోతున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో నుంచి, అంతరంగంలో నుంచి రావాలే కానీ పేపర్లు, టీవీల్లో కాదు చెల్లెమ్మా! అని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ ఏనాడూ ఢిల్లీలో డిమాండ్ కు వినిపించలేదు కానీ పూర్వాశ్రమంలో మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన మీ మాజీ బాస్ సోనియా గాంధీకి ఇప్పుడు చెబుతున్న హృదయపూర్వక కృతఙ్ఞతలు మరచిపోలేమమ్మా! అంటూ పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి కామెంట్లు చేశారు.
Next Story