Mon Dec 23 2024 04:26:46 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: విజయసాయి రెడ్డి
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే, జైల్లో ఆయనకు సరైన భద్రత లేదని టీడీపీ శ్రేణులు.. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జైలులోనే చంద్రబాబును చంపే కుట్ర జరుగుతుందని సంచలన ప్రకటన చేశారు. సైకో జగన్ తమ పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించి జైలులోనే అంతం చేసే ఆలోచన చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ దే బాధ్యత అని లోకేష్ అన్నారు. జైలులో దోమలు కుడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న లోకేష్ అదే జైలులో రిమాండ్ ఖైదీ డెంగ్యూ వాధితో మరణించారని గుర్తు చేశారు. చంద్రబాబును కూడా ఇలాగే చంపేయాలని జగన్ కుతంత్రాలు చేస్తున్నాడని ఆరోపించారు.
ఈ పరిణామాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీ వ్యవహారం చూస్తుంటే.. మీరు, మీ పార్టీ వారే జైల్లో ఉన్న చంద్రబాబుకు హాని తలపెడతారనే అనుమానం కలుగుతోందని అన్నారు. బాబుకు వెన్నుపోటు పొడిచి, ఆయన పదవిని కొట్టేయాలన్న కసి కొందరు టీడీపీ నేతల్లో కనిపిస్తోందని.. టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్ అయినంత మాత్రాన జైల్లో ఫ్యాన్ వాడరాదన్న నియమం ఏమీలేదని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫ్యాన్ తీసేసి నాకు ఏసీ కావాలని పట్టుబట్టినా జైలు నిబంధనలు అందుకు అనుమతించవన్నారు.. అంతేకాకుండా స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగడం లేదంటే ఎలా? అని ట్విట్టర్ లో ప్రశ్నించారు విజయసాయి రెడ్డి.
Next Story