Mon Dec 23 2024 07:01:57 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : అర్థరాత్రి వరకూ విజయవాడకు గండమేనట....?
ఈరోజు అర్థరాత్రి వరకూ విజయవాడ ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.
ఈరోజు అర్థరాత్రి వరకూ విజయవాడ ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. అమావాస్య కావడంతో కృష్ణా నదిలో నీరును సముద్రం తీసుకోదు. వెనక్కు తంతుంది. ఈరోజు అమావాస్య కావడంతో సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయి. పోటు మీదున్న సముద్రం వరద నీటిని తాను తీసుకునే పరిస్థితి ఉండదు. అందుకే కృష్ణా నదితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వెళుతున్న నీటిని సముద్రం తిరిగి వెనక్కు నెడుతుంది. అమావాస్య దాటిన తర్వాతనే సముద్రం వరద నీటిని తనలో తీసుకుంటుందని చెబుతున్నారు. ఈరోజు అర్థరాత్రి 12 గంటల వరకూ అమావాస్య ఉంది. అందుకే అర్థరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత మాత్రమే ప్రమాదం తప్పే అవకాశాలున్నాయి.
కృష్ణానది నుంచి...
ఇప్పటికీ పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్కుల నీటిని అధికారులు ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్నారు. అయితే ఆ నీరు సముద్రంలోకి చేరకపోవడంతో విజయవాడ నగరంలో పడుతుంది. అందుకే భారీ వర్షాలు లేకపోయినా సరే.. నీరు పెరుగుతుంది. దీంతో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. పాలప్యాకెట్లను కూడా పంపిణీ చేశారు. పేషెంట్లు, వృద్ధులను కాపాడేందుకు ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్ టీంలు వచ్చాయి. ఆరు హెలికాప్టర్లతో పాటు వంద బోట్లు బాధితులను చేరవేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే శివారు ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
తట్టుకోవడం కష్టమే....
దీంతో పాటు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. భోజనాలను అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇళ్లలో వస్తువులన్నీ నీటిపాలయ్యాయి. టీవీలు, ఫ్రిజ్ లు, ద్విచక్ర వాహనాలు, కార్లు ఇలా ఏదీ పనికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒక్కొక్క కుటుంబానికి భారీగానే ఆస్తి నష్టం జరిగింది. వీటిని తట్టుకుని మళ్లీ నిలదొక్కుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. బెజవాడ బావురుమంటోంది. ప్రభుత్వం కొంత వరకూ ఆదుకోగలదు. అంతే తప్ప ప్రతి కుటుంబాలు కోల్పోయిన వాటిని వెనక్కు తీసుకు రాలేదు. కానీ జరిగిన నష్టం తలచుకుని బాధితులు కుమిలిపోతున్నారు.
Next Story