Tue Nov 19 2024 08:45:54 GMT+0000 (Coordinated Universal Time)
నాని ఏమి చేయబోతున్నారు?
ఇటీవల నందిగామ నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన పనులు ప్రారంభోత్సవానికి వెళ్లిన కేశినేని నాని. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావును ప్రశంసలతో ముంచెత్తారు
టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మొన్న వైసీపీ నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఇప్పుడు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయన. ఆయన చర్యలను టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ కేశినేని నాని మంచి వ్యక్తి అని, ఆయన వైసీపీలోకి వస్తానంటే ఆహ్వానిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు కూడా విజయవాడ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
విజయవాడ పార్లమెంట్ నుంచి టీడీపీ తరపున 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలుపొందిన ఎంపీ కేశినేని నాని ఎంపీగా టీడీపీ ఏ పిట్టల దొరకు టిక్కెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని, తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజలు తనను మరోసారి కోరుకుంటే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను పార్టీ ఎలా తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. అభివృద్ధి విషయంలో తనకు పార్టీలతో సంబంధం లేదని, ఎవరితోనైనా కలిసి పని చేస్తానన్నారు. తన మనస్తత్వానికి సరిపోతుందనుకుంటే ఏ పార్టీ అయినా ఇబ్బంది లేదన్నారు.
ఇటీవల నందిగామ నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన పనులు ప్రారంభోత్సవానికి వెళ్లిన కేశినేని నాని. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావును ప్రశంసలతో ముంచెత్తారు. మొండితోక బ్రదర్స్ మంచి వ్యక్తులని చెప్పుకొచ్చారు. బుదవారం మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆహ్వానం మేరకు ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి, రాజకీయాలు వేర్వేరని చెప్పుకొచ్చారు. ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమేనన్నారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అని, తన మాటలను పార్టీ ఎలా తీసుకున్నా భయం లేదన్నారు.
కేశినేని నాని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఇప్పటికే టీడీపీ హైకమాండ్ కు పలు ఫిర్యాదులు వెళ్లాయి. టీడీపీ హైకమాండ్ కూడా కేశినేని నాని వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తోంది. కేశినేని నాని టీడీపీ లైన్ దాటి మాట్లాడుతున్నారని, హైకమాండ్ ను కూడా లెక్కచేయని ధోరణిలో వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో నాని ఏమి చేయబోతున్నారో అనే సస్పెన్స్ మాత్రం అందరినీ వెంటాడుతూ ఉంది.
Next Story