Fri Nov 22 2024 20:04:41 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : ఎవరిదీ తప్పుకాదు.. ఒకరిని తప్పు పట్టడం సరికాదు.. అసలక్కడ ఏం జరిగిందంటే?
బెజవాడకు తీరని కష్టమొచ్చింది. ఎన్నడూ చూడని బాధలను గత నాలుగు రోజుల నుంచి విజయవాడ ప్రజలు చూశారు.
బెజవాడకు తీరని కష్టమొచ్చింది. ఎన్నడూ చూడని బాధలను గత నాలుగు రోజుల నుంచి విజయవాడ ప్రజలు చూశారు. ఒకరకంగా నరకాన్ని అనుభవించారు. తినడానికి తిండి లేదు. తాగడానికి నీరు లేదు. అంత వరదలోనూ వర్షం కురవాలని కోరుకున్నవారు అధికంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే వర్షపు నీటితోనైనా తమ గొంతులను తడుపుకుందామన్న భావన వారిలో కలిగింది. బాధితులు ఇప్పుడు బయటకు వచ్చి తాము పడ్డ బాధలు చెబుతుంటే కన్నీరు ఆగడం లేదు. అందుకే బెజవాడను వదలి వెళ్లిపోతున్నామని చెబుతున్నారు. మరోవైపు చిన్న పిల్లలు పాల కోసం ఏడుస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.
ఈ స్థాయిలో...
అవును ఇది ప్రకృతి చేసిన ఘోరం. మానవ తప్పిదమే కాదు. ఎందుకంటే విజయవాడలో ఇంత స్థాయిలో ఎప్పుడూ భారీ వర్షాలు పడలేదు. అయితే ప్రభుత్వం కూడా సరైన సమయంలో ప్రజలను అప్రమత్తం చేయకపోవడం కూడా ఒక తప్పుగానే చూడాలి. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కింది స్థాయి ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకూ కష్టపడ్డారు. వారిని ఓదార్చేందుకు ప్రయత్నించారు. భరోసా కల్పించడంలో సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని ప్రాంతాలకు ఆహార పదార్ధాలను, మంచినీటిని, పాలను అందించలేకపోయారు. ఇందుకు అధికారుల తప్పిదమో, ప్రభుత్వ వైఫల్యమో అని చెప్పలేం.
బోట్లు కూడా వెళ్లలేని...
ఎందుకంటే అధికారంలో ఎవరున్నా ఇదే పరిస్థితి ఉంటుంది. అలాగే అధికారుల్లో కూడా అంతే. ప్రభుత్వాలతో పనిలేదు. వారి విధి నిర్వహణలో భాగంగా తమకు అప్పగించిన డ్యూటీని చేస్తారు. కానిస్టేబుల్ నుంచి రెవెన్యూ ఉద్యోగి వరకూ ఎవరైనా బాధితులకు సాయం చేయాలనే ఉంటుంది. కానీ సహకరించని పరిస్థితులు ఉంటాయి. బుడమేరు పొంగి కొన్ని ప్రాంతాలకు బోట్లు కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు ఎనిమిది అడుగుల నీరు రావడంతో శివారు ప్రాంతాలకు ఆహార పదార్థాలను చేరవేయలేకపోయారు. అందుకు కారణం మొదటి రోజు బోట్లు అందుబాటులో లేకపోవడం. రెండో రోజు మర బోట్లు వచ్చినా అవి అన్ని ప్రాంతాలకు చేరుకోలేకపోవడంతో ఫుడ్ మెటీరియల్ ను చేర్చలేకపోయామని చెబుతున్నారు.
బెజవాడ ఖాళీ....
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బాధితుల సంఖ్య. ఇది మూడున్నర లక్షల మంది. మూడున్నర లక్షల మందికి ప్రతి రోజూ ఆహార పదార్థాలను, తాగేందుకు నీటిని అందించాలంటే మానవ సాధ్యం కాదు. అందరినీ ఒక చోట చేర్చగలిగితే వారికి భోజనం అందించవచ్చు. కానీ వారి ఇళ్లకు వెళ్లి అందించాలంటే అది ఎవరివల్లా కాదని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఇప్పుడు బెజవాడ తేరుకుంటుంది. మరోసారి భారీవర్షాలు పడతాయని హెచ్చరించడంతో ఇళ్లను వదిలేసి గుంటూరు పరిసర గ్రామాలకు వెళ్లి తలదాచుకుందామని లక్షల మంది బెజవాడను ఖాళీ చేసి వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. భారీ వరదలు కన్నీటిని కుటుంబాలకు మిగిల్చింది. నష్టం ఎంత జరిగిందన్నది మాత్రం అంచనాకు కూడా అందడం లేదు.
Next Story