Mon Dec 23 2024 14:05:58 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో వైసీపీకి ఎదురుదెబ్బ.. కీలక నేత రాజీనామా
పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు స్వేచ్ఛ ఇవ్వలేదని వాపోయారు. తనకు ఘాటుగా విమర్శించడం రాదన్న పంచకర్ల రమేష్..
విశాఖలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో కీలక నేత రాజీనామా చేశారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా విషయాన్ని మీడియాకు వెల్లడిస్తూ.. ఎందుకు రాజీనామా చేస్తున్నారో వివరించారు. తనను నమ్మిన పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని, పార్టీకి రాజీనామా చేయడం చాలా బాధగా ఉందన్నారు. ఏడాది కాలంగా తాను ఎన్నో సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించానని, కానీ వీలుకాలేదన్నారు. ప్రజా సమస్యల్ని కింది స్థాయిలో ఉన్నప్పుడే తీర్చలేనపుడు అలాంటి పదవిలో ఉండటం సమంజసం కాదన్న ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు స్వేచ్ఛ ఇవ్వలేదని వాపోయారు. తనకు ఘాటుగా విమర్శించడం రాదన్న పంచకర్ల రమేష్.. అధిష్టానం సామాజికవర్గ సమావేశాలు పెట్టొద్దని ఆదేశించిందన్నారు. సుబ్బారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తన అనుచరులతో సమావేశమై.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కాగా.. పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ పార్టీ నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమవ్వగా.. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. 2014లో టీడీపీలో చేరారు. అప్పుడు యలమంచిలి నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన.. 2020లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీకి కూడా రాజీనామా చేసిన పంచకర్ల రమేశ్ తదుపరి ఏ పార్టీలో చేరుతారన్న విషయంపై విశాఖ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
Next Story