Wed Nov 27 2024 09:55:55 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : కూటమి పార్టీ నేతల ఫైటింగ్.. కాంట్రాక్టుల కోసం వీధిపోరాటం
ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీ నేతల మధ్య వార్ మొదలయింది. రాయలసీమలో అనేక ఘటనలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీ నేతల మధ్య వార్ మొదలయింది. రాయలసీమలో అనేక ఘటనలు జరుగుతున్నాయి. అయినా కూటమి పార్టీల అధినేతలు మాత్రం సర్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. మొన్నామధ్య ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ కు, టీడీపీ నేతలకు మధ్య వివాదం చోటు చేసుకుంది. అలాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు తన సొంత పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నిర్మాణ పనులపై దాడులకు దిగి వాహనాలను ధ్వంసం చేసిన సంగతిని కూడా మర్చిపోలేం. ఇద్దరూ బీజేపీ నేతలే అయినా కాంట్రాక్టుల కోసం పోరాటం మొదలయింది. తాజాగా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చేలా కనిపిస్తున్నాయి.
ఫ్లైయాష్ కాంట్రాక్టును...
ఫ్లైయాష్ రవాణా కాంట్రాక్టును తమకే అప్పగించాలంటూ రెండు వర్గాలు బాహాబాహీకి తలపడనున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలను ఆదినారాయణరెడ్డి మనుషులు అడ్డుకున్నారు. ఫ్లైయాష్ కాంట్రాక్టు తమకే కావాలంటూ ఇరువర్గాల నేతలు పట్టుబడుతున్నారు. కానీ తమ వాహనాలను అడ్డుకోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. తాను సహించబోనని జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను సీఎం రమేష్ లా చూస్తూ ఊరుకునే వాడిని కాదని హెచ్చరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కేవలం హెచ్చరికతో మాత్రమే వదలిపెట్టకుండా జిల్లా ఎస్పీకి, జాయింట్ కలెక్టర్ కు లేఖ రాయడంతో వివాదం మరింత ముదిరింది. అయితే రెండు వర్గాలు బాహాబాహీకి దిగుతారన్న సమాచారంతో పోలీసులు తాడిపత్రి నుంచి ఆర్టీపీపీ వరకూ మూడు చోట్ల చెకె పోస్టులను ఏర్పాటు చేసి పెద్దయెత్తున మొహరించారు.
పోలీసుల భారీ మొహరింపు....
ఇద్దరూ ఒకరికి ఒకరు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇద్దరూ ఫ్లైయాష్ కాంట్రాక్టు కోసం పట్టుబడుతుండటంతో కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడమే కాకుండా బాహాబాహీకి దిగుతారన్న హెచ్చరికలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి కడపకు వస్తానని చెప్పారు. దీంతో పోలీసులు భారీగా మొహరించారు. కడప జిల్లా కొండాపురం మండలం సుగమంచిపల్లి వద్ద రోడ్డుపై భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కడప, అనంతపురం జిల్లాల సరిహద్దులో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కడపకు వస్తే అడ్డుకునేందుకు కడప పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కడప జిల్లా బార్డర్ సుగమంచిపల్లె వద్ద అడ్డుకొని, అక్కడి నుంచి ఆటే వెనక్కి పంపే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కడప, అనంతపురం జిల్లాలో కూటమి నేతల మధ్య ఫ్లైయాష్ రగడ మరింత ముదిరే అవకాశముంది.
Next Story