Mon Dec 23 2024 09:34:18 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో నేడు అక్కడ సెలవులే
బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా తామడలో 145 మిమీ, విజయనగరం జిల్లా గోవిందపురంలో 136 మిమీ
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది నెమ్మదిగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని భావిస్తున్నారు. గురువారం నాడు అక్కడక్కడ భారీ వర్షాలు, శుక్రవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల రవాణా, తరగతి గదుల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లిఖార్జున ఆదేశాలతో డీఈవో చంద్రకళ ఈ నిర్ణయం తీసుకుంది. శిథిలావస్థలో ఉన్న గదుల్లో తరగతులు నిర్వహించవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని పాఠశాలలనూ మూసివేసేలా పర్యవేక్షించాలని ఎంఈవో, డెప్యూటీ డీఈవో లకు కలెక్టర్ ఆదేశాలు పంపారు. భారీ వర్షాలు, వరదలు నేపధ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రంగాన్ని అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా తామడలో 145 మిమీ, విజయనగరం జిల్లా గోవిందపురంలో 136 మిమీ, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 114 మిమీ, విశాఖపట్నంలో 111 మిమీ అధిక వర్షపాతం కురిసింది.
Next Story