మరోసారి తడిసి ముద్దవ్వనున్న తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలు మరోసారి తడిసి ముద్దవ్వనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు
తెలుగు రాష్ట్రాలు మరోసారి తడిసి ముద్దవ్వనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు జోరందుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులపాటు కూడా వర్షసూచన జారీ చేరింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీ తీరాన్ని ఆనుకుని సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఇది ఉంది. దీనితో పాటు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వానలు కురుస్తాయని అంచనా వేసింది. 14వ తేదీన చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, కోనసీమ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. ఆగస్టు 15న పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ఏలూరు, ఎన్టీఆర్, కోనసీమ, విజయనగరం జిల్లాల్లో వానలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అటు కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో కూడా అక్కడక్కడ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురుస్తున్నాయి.