Tue Nov 05 2024 06:44:38 GMT+0000 (Coordinated Universal Time)
ఇంతకూ స్కిల్ డెవెలప్మెంట్ స్కాం ఏమిటి?
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ అయ్యారు. సీఐడీ అరెస్టు చేయగా..
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ అయ్యారు. సీఐడీ అరెస్టు చేయగా.. ఈ కుంభకోణం పై ఈడీ కూడా విచారణ జరుపుతూ ఉంది. ఇప్పటికే పలువురు నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు. షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్టెక్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10 శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్టెక్ సంస్థకు బదలాయించారంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. దాదాపు రూ. 240 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఏపీ సీఐడీ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన రూ. 371 కోట్లలో రూ.240 కోట్లను వేర్వేరు షెల్ కంపెనీలకు మళ్లించినట్టు సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర కంపెనీలకు నిధులు మళ్లించారు. సీమెన్స్ సంస్థ ఇండియా హెడ్గా ఉన్న సుమన్ బోస్, డిజైన్టెక్ సంస్థ ఎండీగా ఉన్న వికాస్ కన్వికర్ ద్వారా కుంభకోణం నడిపించినట్టు సీఐడీ విచారణలో బయటపడింది. రూ.3300 కోట్ల ప్రాజెక్టుగా ఎంఓయూ చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. జీవోలో మాత్రం రూ.3300 కోట్ల ప్రస్తావనను తొలగించింది. చివరకు రూ.240 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా మళ్లించేశారని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కుంభకోణం 2016- 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు సీఐడీ పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును శనివారం ఉదయం అరెస్ట్ చేశారు.
Next Story