Sun Dec 15 2024 11:30:57 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు స్కెచ్ అదిరిపోయిందిగా.. పవన్ పార్టీకి చెక్ పెట్టడానికేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఒక రాజకీయ కోణం ఉంటుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఒక రాజకీయ కోణం ఉంటుంది. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. తాను తీసుకునే నిర్ణయం పార్టీ బలోపేతానికి, అవతల వ్యక్తులను బలహీనపర్చడానికి కారణమవుతాయని భావిస్తేనే డెసిషన్ కు వస్తారు. కొంత లేట్ అయినా సరే చంద్రబాబు దూర దృష్టితో నిర్ణయాలు తీసుకుంటారని, ఆయన వ్యూహాలను ఇప్పటికిప్పుడు అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదని చెబుతారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన ఆలోచనలన్నీ పార్టీని బలోపేతం చేయడంపైనా, తనకు భవిష్యత్ లో ఎలాంటి రాజకీయ పరమైన ఇబ్బందులు తలెత్తినా ఇబ్బంది కలగకుండా కొన్నికీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ఎవరు నొచ్చుకున్నా...
తన నిర్ణయాలకు ఎవరు నొచ్చుకున్నా, అలిగినా కూడా ఆయన లెక్క చేయరు. తర్వాత వారికి సర్దిచెప్పే స్టామినా చంద్రబాబు నాయుడు వద్ద ఉంది. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే చంద్రబాబు స్కెచ్ అదిరిపోయిందిగా అన్నట్లు తెలుగు తమ్ముళ్లే ఆశ్చర్యపోతున్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎప్పుడైనా తమ చేతులు దాటి పోవచ్చు. ఏపీలో ప్రస్తుతం కూటమిగా మూడు పార్టీలూ కలసి ఉన్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ కలసి ఉండటంతో తిరుగులేని శక్తిగా మొన్నటి ఎన్నికల్లో అవతరించి అధికారంలోకి రాగలిగింది. అయితే రానున్న కాలంలో పరిణామాలను ఊహించలేం. ఎవరు ఎటువైపు వెళతారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది.
ముందుగానే చెక్ పెట్టాలనా?
చంద్రబాబు ఎవరినీ రాజకీయంగా అంతసులువుగా నమ్మరు. ఇప్పుడు సన్నిహితంగా ఉన్నవారు రేపు వ్యతిరేకం కారని గ్యారంటీ లేదు. కూటమి కూడా ఎంత కాలం కొనసాగుతుందో నమ్మకం లేదు. అలాగే కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీని అస్సలు నమ్మరు. మోదీ వ్యూహాలు అలా ఉంటాయి. మోదీ వ్యూహాల నుంచి పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. బయటకు మంచిగానే కనపడుతున్నప్పటికీ, స్నేహంగానే కొనసాగుతున్నప్పటికీ వచ్చేకాలంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం. బీజేపీ ఎలా చెబితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అలాగే నడుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కాపు సామాజికవర్గం నేతలతో టీడీపీ నింపేయాలని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తుంది.
కాపు నేతలే లక్ష్యంగా...
వైసీపీలో బలమైన కాపు సామాజికవర్గం నేతలను తమ పార్టీలో చేర్చుకుని కాపు సామాజికవర్గంలో బలపడటమే కాకుండా పవన్ కల్యాణ్ తమకు దూరమైనా భవిష్యత్ లో సామాజికవర్గం పరంగా ఇబ్బందులు పడకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందులో భాగంగానే ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్, గ్రంథిశ్రీనివాస్ లతో వైసీపీకి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంటున్నారన్న టాక్ వినపడుతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ను చేర్చుకోవడంతో దానికి ప్రతిగా కాపు సామాజికవర్గం నేతలను పెద్దయెత్తున చేర్చుకోవాలన్న నిర్ణయానికి కూడా చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ ఆలోచన లోకేష్ నుంచి వచ్చిందేనని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో కాపు నేతల కోసం టీడీపీ నాయకత్వం బాగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.
Next Story