Thu Nov 21 2024 21:14:17 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : మంత్రులకు ఫ్రీ హ్యాండ్.. సరికొత్త ట్రెండ్ చంద్రబాబు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గత వైసీపీ ప్రభుత్వానికి, ఇప్పటి సర్కార్ కు మధ్య పోలికలు వస్తుంటాయి.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గత వైసీపీ ప్రభుత్వానికి, ఇప్పటి సర్కార్ కు మధ్య పోలికలు వస్తుంటాయి. అయితే గత ప్రభుత్వంలో పాలన అంతా ఏకపక్షంగా సాగిందన్న విమర్శలున్నాయి. కొందరి చేతుల్లోనే పాలన ఉందన్నది అందరూ అంగీకరించే విషయమే. అన్ని శాఖలకు మంత్రులున్నా, లెక్కకు మించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లున్నా వారంతా ఉత్సవ విగ్రహాలేనంటూ ఆరోపణలు వినిపించాయి. సకల శాఖల మంత్రి అంటూ కోటరీ నేతలపై విమర్శలు కూడా పెద్డయెత్తున విమర్శలు వినిపించాయి. అంటే గత వైసీపీ ప్రభుత్వం లో మంత్రులకు స్వేచ్ఛ లేదు. స్వతంత్రంగా తమ శాఖలో నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా లేదు.
గత ప్రభుత్వ హయాంలో...
అధికారి బదిలీ కావాన్నా సీఎం పేషినో, సకల శాఖల మంత్రినో సంప్రదించాలన్నది నాటి ప్రభుత్వంలో వినిపించే విమర్శలు. కాకుంటే పదవి కావడం, పేరు ముందు మంత్రి ఉండటం, ప్రొటోకాల్ కూడా ఉండటంతో మంత్రులు గత పాలనలో కిమ్మనలేదు. తమకు అవసరమైన పనులు తాము తీసుకోవాలంటే అందుకు కొందరి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. బదిలీల నుంచి ముఖ్య నిర్ణయాలను తీసుకునేందుకు మంత్రులు తాడేపల్లి కార్యాలయం వైపు చూసేవారంటారు. అందుకే కొందరు మంత్రులుగా ఉన్నప్పటికీ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోయారు. సంస్కరణలను కూడా తమ శాఖల్లో తేలేకపోయారన్న విమర్శలు వినిపించాయి.
మొన్నటి కేబినెట్ మీటింగ్ లో...
అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని చెబుతున్నారు. ప్రజోపయోగమైన ఏ నిర్ణయమైనా అధికారులతో చర్చించి తీసుకోవాలని మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఆయన మంత్రులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే అధికారులు చెప్పిన ప్రతి మాటకు తలాడించకుండా అందులో లోతుపాతులను పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. ప్రజా ప్రయోజనాలు దెబ్బతినకుండా, రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా ప్రజల సంక్షేమ కోసం తీసుకునే ఏ నిర్ణయాలనైనా తాను స్వాగతిస్తానని, అన్నీ తన దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదని కూడా ఆయన మంత్రివర్గ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గతంలో చంద్రబాబు అంతా తానే అయి చూసేవారు. కానీ ఈసారి మాత్రం తన ఆలోచనను మార్చుకున్నారని మంత్రులే వ్యాఖ్యానిస్తున్నారు.
పాలనలో భాగస్వామ్యాన్ని...
పరిపాలన సజావుగా సాగాలన్నా అందరి భాగస్వామ్యం ఉండాలని, అందరి ఆలోచనలతోనే ముందుకు వెళ్లగలిగితేనే మనం గోల్ రీచ్ అవుతామని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. మీడియాకు ఒక విధానమైన ప్రకటన చేసే ముందు కూడా అనుభవజ్ఞులైన అధికారులతో చర్చించి చేయాలని, అలాకాకుండా ప్రకటన చేసి వెనక్కు వెళితే నవ్వుల పాలు అవుతామని కొత్తగా ఎన్నికైన మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అంతా తానే అయి వ్యవహరించకుండా మంత్రులకు కూడా పూర్తి భాగస్వామ్యం కల్పించాలని చంద్రబాబు ఈనిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దృష్టికి కూడా అన్ని శాఖల ప్రధాన సమస్యలను తీసుకెళ్లవచ్చని కూడా ఆయన సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుందంటున్నారు.
Next Story