Fri Apr 18 2025 21:26:13 GMT+0000 (Coordinated Universal Time)
Nallari : నల్లారి నక్క తోక తొక్కినట్లేనా? అందుకే యాక్టివ్ అయ్యారా?
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై చర్చ జరుగుతుంది

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై చర్చ జరుగుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రముఖంగా వినపడుతున్నా అది ప్రచారం మాత్రమేనంటున్నారు. చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఆయన సినిమాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఆయన మోదీతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నంత మాత్రాన రాజకీయాల్లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చినట్లు కాదని జనసేన ముఖ్యనేతలే చెబుతున్నారు. చిరంజీవి కూడా రాజ్యసభ పదవిని తీసుకునేందుకు ఇష్టంగా లేరు. అస్సలు రాజకీయాల జోకి రాకూడదని ఆయన బలంగా నిర్ణయించుకున్నారని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.
నల్లారి పేరు ...
అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు నుంచి కూడా పెద్దగా అభ్యంతర పెట్టకపోవచ్చని అంటున్నారు. చిత్తూరు జిల్లాలో నల్లారి, నారా కుటుంబాలు కలిస్తే వచ్చే ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను సాధించవచ్చని, దీంతో పాటు రెడ్డి సామాజికవర్గంలోనూ సానుకూలత కూటమి పార్టీలకు లభిస్తుందన్న అంచనాతో ఆయనను ఎంపిక చేసే అవకాశాలున్నాయంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గత కొంతకాలం మౌనంగా ఉంటున్నారు.
ఎప్పుడో ఫిక్స్ అయిందంటూ...
ఇటీవల ఆయన యాక్టివ్ కావడంతో హస్తిన నుంచి వచ్చిన సంకేతాలే కారణమని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా తన వల్లనే జరిగింది కాబట్టి తమకే కేటాయించాలని బీజేపీ పట్టుబట్టిందని, ఇప్పటికే చంద్రబాబు దృష్టిలో ఉందని, ఇటీవల అమరావతి లో జరిగిన హైలెవెల్ మీటింగ్ లోనే ఈ విషయం చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలాడుతున్నాయి. కేంద్రంలో కీలకమైన నేతను విజయసాయిరెడ్డి గత కొంత కాలం కలిసినప్పుడే రాజీనామా ఫిక్స్ అయిపోయిందంటున్నారు. అయితే వెనువెంటనే కాకుండా రాజీనామా నిర్ణయాన్ని కొంత ఆలస్యంగా విజయసాయిరెడ్డి వెల్లడించారని అంటున్నారు. ఈ స్థానంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు దాదాపు ఖాయమయినట్లేనని అంటున్నారు.
మంత్రివర్గంలో అందుకేనా?
చంద్రబాబు కూడా అందుకే చిత్తూరు జిల్లా నుంచి మంత్రి లేకుండా తన కేబినెట్ ను విస్తరించడం కూడా అందుకు కారణమని చెబుతున్నారు. నల్లారి కుటుంబాన్ని పక్కనపెట్టారంటే అప్పుడే కొందరు సందేహించారు. అన్నదమ్ముల్లో ఒకరికి మంత్రి పదవి లభిస్తే మరొకరికి రాజ్యసభ పదవి దక్కదని భావించి పదవులకు దూరంగా ఉన్నారన్న టాక్ కూడా వినపడుతుంది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని 2014 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే పార్టీలో చేరిన వెంటనే నామినేటెడ్ పదవిని ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ పదవికి రెడ్డి కోటాలో నల్లారిని ఎంపిక చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story