Tue Dec 24 2024 13:41:52 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. అమరావతి నిర్మాణ పనులు ఇక వేగవంతం
రాజధాని అమరావతికి నిధులను ప్రపంచ బ్యాంకు కేటాయించింది. పదిహేను వేల కోట్ల రూపాయల రుణాన్ని మంజూరుకు అనుమతి తెలిసింది
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నిధులను ప్రపంచ బ్యాంకు కేటాయించింది. పదిహేను వేల కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసేందుకు అనుమతి తెలిసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల ప్రాజెక్టు ఈ నాలుగేళ్లలోనే సాకారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లభిస్తుండటంతో ఇక వేగిరం పనులు ప్రారంభించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతుంది. నిధులు మంజూరు అయిన వెంటనే టెండర్లను పిలిచే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇప్పటికే దాదాపు 36 కోట్ల రూపాయలు వ్యయం చేసి అమరావతి పరిధిలో ముళ్ల చెట్లను, కంపలను తొలగించారు.
ప్రపంచ బ్యాంకు ఓకే...
ఈ ఏడాది చివరి నాటికి రాజధాని అమరావతి నిర్మాణపనులు అన్ని సానుకూలిస్తే ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను ప్రపంచబ్యాంకు, ఆసియన్ డెవలెప్మెంట్ బ్యాంకులు కలసి ఇవ్వనున్నాయి. దీనికి సంబంధించిన లేఖ అందడంతో చంద్రబాబు ముఖంలో నవ్వులు పూశాయి. తాను మరో నగరం నిర్మాణం పూర్తి చరిత్రలో నిలిచిపోవాలని ఆయన కలలు త్వరలోనే సాకారమయ్యే అవకాశముంది. శాసనసభతో పాటు, హైకోర్టు, సెక్రటేరియట్, అన్ని డిపార్ట్మెంట్ల హెడ్ల కార్యాలయ భవనాలకు సంబంధించి నిర్మాణ వ్యయం 49 వేల కోట్ల రూపాయలు అవుతుందని ప్రాధమికంగా అంచనా వేశారు.
వేగిరంగా పనులు...
అయితే పదిహేను వేల కోట్ల రుణంతో పాటు అదనపు నిధులతో కూడా రాజధాని పనులను వేగిరం చేపట్టాలని సీఎం చంద్రబాబు సీఆర్డీఏ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలెప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు రాజధాని ప్రాంతంలో పర్యటించి వెళ్లిన తర్వాత ఈ నిధులు మంజూరయ్యాయి. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూపాయి కూడా ఖర్చు చేయకపోవడంతో పాటు మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు రావడంతో రాజధాని ఎక్కడ? అన్నది తెలియకుండా పోయింది. కానీ చంద్రబాబు అమరావతి రాజధానిగా ఉంటుందంటూ స్పష్టమైన ప్రకటన చేసి ఎన్నికలకు వెళ్లి కూటమికి ఘన విజయం సాధించిపెట్టారు. చంద్రబాబు ఈ టర్మ్ లో అమరావతికి ఒక రూపు రేఖలు తేగలిగితే హిస్టరీలో చంద్రబాబు పేరు నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Next Story