Fri Nov 22 2024 20:08:50 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేను బచ్చా అయితే కూటమితో ఎందుకు వస్తున్నావు బాబూ?
టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్ బచ్చా అని చంద్రబాబు అంటున్నారని, తాను బచ్చా అయితే కూటమిగా ఎందుకు వస్తున్నావంటూ ప్రశ్నించారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదా అని నిలదీశారు. కృష్ణుడిని బచ్చా అన్న కంసుడు గుర్తుకు వస్తున్నాడని అన్నారు. తాను బచ్చా అయినా ఒంటరిగా, ధైర్యంగా పోటీ చేస్తున్నానని అన్నారు. తాను బచ్చా అయితే నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనలాని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో రెండు సముద్రాలు కనిపిస్తున్నాయని, జనసముద్రానికి ఈ సభ అద్దంపడుతుందని జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లకు భవిష్యత్ అని అన్నారు. 75 ఏళ్ల ముసిలాయన పాలనలో ఏం జరిగిందో అందరూ చూశారన్నారు.
58 నెలలో...
జగన్ యాభై ఎనిమిది నెలలో చేసిన మంచిని నువ్వు పథ్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశావా? అని ప్రశ్నించారు. పెత్తందారులపై యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. ఎప్పుడూ లేని విధంగా 2.75 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారులను అందచేసింది ఒక బచ్చాయేనంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇలా ఎప్పుడైనా జరిగిందా? అని ప్రజలను అడిగారు. నువ్వు ఎప్పుడైనాచూశావా? అని చంద్రబాబును అడిగారు. రైతు భరోసా, నేతన్న హస్తం, వాహన మిత్ర వంటి పథకాలను మీరు ఎప్పుడైనా చూశారా? అని అన్నారు. ఈ పథకాలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. మీ బిడ్డ పాలనలోనే అది సాధ్యమయిందన్నారు. అక్కచెల్లెమ్మల కోసం ఆలోచనలు చేసిన ప్రభుత్వం తమదేనని అన్నారు.
లంచాలు లేకుండా...
ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని తెలిపారు స్వయం ఉపాధిని ప్రోత్సహించామని చెప్పారు. ప్రజలకు ఇంత మంచి చేసిన ప్రభుత్వం కావాలా? కేవలం నలుగురు దోచుకుని తినే ఆ చంద్రబాబు కావాలా? మీరే తేల్చుకోవాలంటూ జగన్ ప్రజలను కోరారు. జగన్ ప్రభుత్వం తెచ్చిన మార్పు గ్రామాల్లోనే కనిపిస్తుందన్నారు. ఆలోచన చేయమని అడుగుతున్నానని, అందరూ ఇంట్లో కూర్చుని ఆలోచించాలని, మీ బిడ్డ అధికారంలోకి రాకమునుపు ఇలాంటి పధకాలు అందాయా? అని ఆయన ప్రశ్నించారు. ఇది జగన్ మార్క్ పాలన అని అన్నారు. చంద్రబాబు మార్క్ పాలన ఏముందని జగన్ నిలదీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చేర్చి అందరికీ అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని జగన్ అన్నారు.
Next Story