Wed Apr 09 2025 18:31:55 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : వైఎస్ జగన్ కు ఈ కేసుల గోలేంటి? హత్య కేసులేంటి?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు గతంలో జరిగిన హత్య కేసులు మెడకు చుట్టుకునేలా ఉన్నాయి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు గతంలో జరిగిన హత్య కేసులు మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. ఒకవైపు పరిటాల సునీత తన భర్త పరిటాల రవి హత్యకు కారణం జగన్ అని ఆరోపించడం సంచలనం కలిగించింది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన హత్య కేసులో జగన్ ప్రమేయం ఉందని ఆమె చెబుతూ హంతకులకు జగన్ ప్రోద్బలం ఉందని పరిటాల సునీత తెలిపారు. జగన్ సహకారంతోనే తన భర్త పరిటాల రవి హత్య జరిగిందన్న ఆరోపణలతో ఫ్యాన్ పార్టీ కొంత ఉక్కపోతకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిటాల రవి 2005లో హత్యకు గురయితే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అంటే 2025 లో పరిటాల సునీత జగన్ ప్రమేయం ఉందని ఆరోపించడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ కోణంలోనే...
పరిటాల రవి హత్య జరిగిన సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ హత్యపై నాడు సీబీఐ విచారణకు కూడా ఆదేశించడానికి సిద్ధమయ్యారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. హత్యపై తర్వాత అనేక ప్రభుత్వాలు మారాయని, వారు విచారణ జరిపినా అసలు నిజం వెలుగు చూసి ఉండేదని చెబుతున్నారు. కానీ రెండు దశాబ్దాల తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని కొట్టిపారేస్తున్నారు. అయితే సునీత చేసిన వ్యాఖ్యలు కొంత జగన్ తోపాటు పార్టీని కూడా ఇబ్బందిపెట్టేవే. ఇప్పటికీ పరిటాలకు వీరాభిమానులున్నారు. ముఖ్యంగా రాయలసీమలో రవి ప్రభావం అనేక నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశముంది.
వివేకా హత్య కేులో...
మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య పై కూడా స్వయంగా సోదరి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. జగన్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ అవినాష్ రెడ్డిని దోషిగా చూపుతూ ఆమె ఇచ్చిన ప్రకటనలు పార్టీకి ఇబ్బంది కలిగించేలా కనిపిస్తున్నాయి. వైఎస్ వివేకా మర్డర్ జరిగి కూడా ఆరేళ్లుదాటిపోయింది. సీబీఐ విచారణ కూడా చేపట్టింది. అయినా ఇంత వరకూ హత్యకు జరిగిన కారణాలను ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ కేసులో కొందరు నిందితులు అరెస్టయినప్పటికీ, అన్నీ వేళ్లూ జగన్ నివాసం వైపు చూపుతున్నాయి. అవినాష్ రెడ్డిని జగన్ రక్షించడం వల్లనే కేసుల నుంచి తప్పించుకోగలిగారని వైఎస్ షర్మిల పరోక్షంగా విమర్శలను ఎక్కుపెట్టడం చర్చనీయాంశమైంది.
అవినాష్ రెడ్డి కారణంగానే..
అవినాష్ రెడ్డి కారణంగా సునీతకు ఆమె పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోవడంతో పాటు దర్యాప్తు అధికారులను కూడా బెదిరించడం అవినాష్ రెడ్డి కే చెల్లుతుందని, అయినా అవినాష్ రెడ్డి బెయిల్ పై బయట తిరుగుతున్నారని వైఎస్ షర్మిల అంటున్నారు. పేరుకు అవినాష్ రెడ్డి పేరును ప్రస్తావించినా పరోక్షంగా జగన్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ వివేకా హత్య కేసులో జగన్ ను ప్రజల ముందు దోషిగా పెట్టే ప్రయత్నం షర్మిల చేస్తుందని ఇట్టే అనుకోవాలి. ఇప్పుడు ఈ రెండు హత్య కేసులు జగన్ ను చుట్టుముట్టాయని చెప్పాలి. వేర్వేరు హత్య కేసులయినా జగన్ కు రాజకీయంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనే చెప్పాలి.
Next Story