Sat Nov 23 2024 03:56:00 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : దెబ్బతిన్నా వైసీపీ వైఖరి మార్చుకోవడానికి అహం అడ్డమొస్తుందా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన విధానాన్ని మాత్రం మార్చుకోలేదు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన విధానాన్ని మాత్రం మార్చుకోలేదు. మూడు రాజధానుల నిర్మాణానికే తాము కట్టుబడి ఉన్నామని ఇప్పటికీ చెబుతుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మొన్నటి ఎన్నికల్లో మూడు రాజధానులంటూ ఆయన జనం ముందుకు వెళ్లారు. ఎక్కడకు వెళ్లినా ఆయన మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చేవారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తాము అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయినా ప్రజలు మూడు ప్రాంతాల్లో వైసీపీని ఆదరించలేదు. ఎన్నడూ లేని దారుణంగా రాయలసీమలోనూ ఆ పార్టీకి అతి తక్కువ సీట్లు రావడం కూడా ఆయన పట్టించుకోవడం లేదు.
మూడు ప్రాంతాల్లో...
విశాఖలో పరిపాలన రాజధాని నిర్మిస్తామని చెబితే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో వచ్చిన సీట్లు కేవలం రెండే రెండు. అది కూడా విశాఖ జిల్లాలోనే రెండు స్థానాలు వచ్చాయి. ఇక కర్నూలులో న్యాయ రాజధాని నిర్మిస్తామని ప్రకటించిన వైసీపీకి మొన్నటి ఎన్నికల్లో వచ్చిన సీట్లు కేవలం రెండే రెండు. కర్నూలు జిల్లాలో ఉన్న పన్నెండు అసెంబ్లీ స్థానాల్లో రెండు రావడం గతంలో ఎన్నడూ జరగలేదు. అనంతపురం జిల్లాలో ఒక్కసీటు కూడా రాలేదు. అక్కడ పధ్నాలుగు సీట్లున్నాయి. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో పది స్థానాలుంటే ఒక్క స్థానమూ దక్కలేదు.
రాజధాని పనులు ...
మరోవైపు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలెప్మెంట్ బ్యాంకు నుంచి కూడా పదిహేను వేల కోట్ల రూపాయలను సేకరించే పనిలో ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఇక పనులు ప్రారంభించడమే మొదలు పెట్టాల్సి ఉంది. అమరావతిలో శాశ్వత అసెంబ్లీ, సచివాలయంతో పాటు అన్ని రకాల కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరో వైపు ముళ్ల కంపలను ఇప్పటికే 36 కోట్ల రూపాయలు వ్యయం చేసి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.
త్రీ కాపిటల్స్ విషయంలో...
కానీ మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గడం లేదని వైసీపీ నేతల మాటలతో తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ మరోసారి మూడు రాజధానుల అంశాన్ని ఆయన కెలికారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అనడంతో వైసీపీ త్రీ కాపిటల్స్ నినాదాన్ని విరమించుకోలేదని స్పష్టమయింది. ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నప్పటికీ తాము చెప్పిన విధానాన్ని పదే పదే చెబుతూ ఆ పార్టీ ప్రజల్లో మరింత పలుచనగా మారుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story