Fri Nov 22 2024 16:49:16 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ ఇక మారరా? ఫలితాలను విశ్లేషించుకునైనా తీరు మార్చుకోరా?
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ పాలసీపై వైఎస్ జగన్ విమర్శలు చేస్తూ చంద్రబాబు నాయుడుకు సుదీర్ఘ లేఖ రాశారు
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ పాలసీపై వైఎస్ జగన్ విమర్శలు చేస్తూ చంద్రబాబు నాయుడుకు సుదీర్ఘ లేఖ రాశారు. దాదాపు ఏడుప్రశ్నలతో చంద్రబాబుకు ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని జగన్ చెప్పారు. జగన్ తన మద్యం విధానంపై మనసు మార్చుకోనట్లే కనిపిస్తుంది. ఇంత డ్యామేజీ జరిగినప్పటికీ ఆయనలో మార్పురాలేదనడానికి ఈ లేఖ నిదర్శనంగా నిలుస్తుంది. ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే వైసీపీ దారుణ ఓటమికి, పదకొండు సీట్లకే పరిమితం కావడానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి మద్యంపాలసీ ఒకటి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అనుసరించిన లిక్కర్ పాలసీని ప్రజలు చీదరించుకున్నారు. మద్య నిషేధం పేరుతో ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు.
నాడు లిక్కర్ పాలసీ...
ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వం తరుపునే మద్యం దుకాణాలను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించారు. ఇక మద్యం దుకాణాల్లో అమ్ముడు పోయిన సరుకు మొత్తం నగదుకు లెక్కలు లేవన్న విపక్షాల ఆరోపణలకు జవాబు లేదు. డిజిటల్ పేమెంట్స్ ను నిరాకరించి జగన్ మరొక కొత్త మార్గంలో పయనించారు. అంతటితో ఆగకుండా నాసిరకమైన బ్రాండ్లను ప్రవేశపెట్టినట్లు మందుబాబులే చెబుతున్నారు. ఎవరైనా లిక్కర్ లవర్స్ తాము కోరుకున్న, అలవాటున్న బ్రాండ్ మద్యం సేవించాలనుకుంటారు. వాటిని అందుబాటులో లేకుండా చేయడమే కాకుండా కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టి అనేక విమర్శలకు గురయ్యారు. మద్యందుకాణాలు ప్రభుత్వం నిర్వహించడంతో పార్టీ పరంగా కూడా నష్టం జరిగింది.
ద్వితీయ శ్రేణి నేతలు...
పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఆర్థికంగా నష్టపోయారు. ఆర్థికంగా వారు నిలదొక్కుకునేలా చేయాల్సిన జగన్ మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహించడం వల్ల వారిలోనూ అసంతృప్తి పెరిగిపోయింది. పోలింగ్ కేంద్రాలకు కూడా దూరంగా ఉన్నారు. వారితో పాటు క్యాడర్ కూడా తీవ్రంగా నష్టపోయిందన్న విశ్లేషణలు వినిపించాయి. ఇక మద్యం ధరలను ఇష్టమొచ్చినట్లు పెంచేశారు. క్వార్టర్ బాటిల్ రెండు వందల రూపాయలకు పైగానే విక్రయించారు. దీంతో మందుబాబులతో పాటు కుటుంబాల్లో కూడా అసంతృప్తి పెరిగింది. రోజువారీ ఆదాయం మొత్తం మద్యానికే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సామాన్య, పేద ప్రజలు కేవలం లిక్కర్ పాలసీ వల్లనే జగన్ వైపు నిలబడలేదు. డబ్బులు ఎన్ని బటన్ నొక్కి పంచుతున్నప్పటికీ మద్యం ద్వారా దోచుకుంటున్నారంటూ విపక్షాలు చేసిన విమర్శలను జనం నమ్మి వారివైపు నిలబడ్డారు.
పునరాలోచన చేయరా?
ఇంత జరిగినా విశ్లేషించుకుని తన మద్యం పాలసీపై పునరాలోచన చేయాల్సిన జగన్ మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన లిక్కర్ పాలసీపై విమర్శలు చేయడం అంటే ఆయనలో మార్పు రాలేదని అర్థమయిందని అంటున్నారు. సాక్షాత్తూ వైసీపీ మద్యం పాలసీపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బహిరంగ విమర్శలు కూడా చేశారు. అయినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనల్లో మార్పు రాలేదు. ఇప్పుడు నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. తక్కువధరకు మద్యం దొరికేలా చంద్రబాబు పాలసీని రూపొందించారు. నిజంగానే తమ నేతలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇవి ఉపయోగపడినా.. అదిపార్టీ బలోపేతానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ జగన్ వైఖరిలో మార్పు లేకపోవడంపై వైసీపీలో చర్చ జరుగుతుంది. ఇక మావోడు మారడు బాబాయ్ అంటూ పెదవి విరుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు అధికారం ఇస్తే మళ్లీ ప్రభుత్వం తరుపున మద్యం విక్రయిస్తానని చెబితే జగన్ కు ఓట్లేసే వారు కూడా కరువవుతారని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా మారితే బెటర్.. లేకుంటే ఇబ్బందులేనని కొందరు నేరుగానే చెప్పడానికి రెడీ అయిపోయారు.
Next Story