Sun Dec 22 2024 21:16:25 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్కు డీల్ చేయడం రాదా? ఇటు రాజకీయంగా? అటు ఫ్యామిలీ పరంగా అంతేనా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పక్కా బిజినెస్ మ్యాన్. రాజకీయాలను, కుటుంబాన్ని డీల్ చేయడం రాదన్నది తేలింది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పక్కా బిజినెస్ మ్యాన్. అంత వరకే. ఆయన రాజకీయాలు డీల్ చేయడంలో ఎంత వీక్ అనేది మొన్నటి ఎన్నికల్లోనే అర్థమయింది. ఇక ఫ్యామిలీని డీల్ చేయడంలోనూ అదే బలహీనత ఉందని కూడా నిన్నటితో పూర్తిగా స్పష్టమయింది. కన్న తల్లి జగన్ కు అడ్డం తిరగడంతోనే అర్థమయింది. ఇటు రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోలేక అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకోలేదు. అలాగే ఆయన కుటుంబాన్ని కూడా సరిగా డీల్ చేయలేక నలుగురిలో నవ్వుల పాలవుతున్నారు. ఆస్తుల వివాదం ఆయన ఇమేజ్ ను చాలా వరకూ డ్యామేజీ చేసిందనే చెప్పాలి. దానిని ఇంత వరకూ ఏ రాజకీయ నేత అయినా.. అందులోనూ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలను తీసుకోవాలని అనుకుంటున్న వారు చేయడం ఎంత వరకూ సబబన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. తల్లి విజయమ్మ కూడా జగన్ పక్షాన నిలవలేదంటే తప్పు జగన్ వైపు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
చంద్రబాబు చరిత్ర చూసైనా...?
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసైనా రాజకీయాల్లో, కుటుంబ పరంగా ఎలా డీల్ చేయాలో తెలుసుకోలేకపోతే ఎలా? అని వైసీపీ సీనియర్ నేతలే ప్రశ్నిస్తున్నారు. మన కళ్ల ఎదుటే చంద్రబాబు కుటుంబంలో ఉన్న ఎన్ని సమస్యలు తలెత్తినా ఎంత జాగ్రత్తగా డీల్ చేయగలిగారో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నటప్పుడు కూడా నందమూరి కుటుంబాన్ని మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకురాగలిగారు. పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడంలో చంద్రబాబుకు దగ్గరుండి సహకరించింది నందమూరి, దగ్గుబాటి కుటుంబాలే. ఇక ఆ తర్వాత ఆయనకు రాజకీయంగా తిరుగులేదు. మరోవైపు తన వారసుడు లోకేష్ తో నందమూరి బాలకృష్ణ కుమార్తెతో వివాహం చేసి మరీ గట్టి పర్చేశారు. ఇక ఢోకా లేకుండా తనకు, రాజకీయాల్లో, ఆస్తుల విషయంలో తిరుగులేకుండా చేసుకోగలిగారు.
రాజకీయంగా కూడా...
కానీ జగన్ విషయంలో ఏమైంది. అన్నింటికీ పూర్తి విరుద్ధం. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి క్యాంప్ కార్యాలయం గడప దాటకుండా గడిపేశారు. కార్యకర్తలను దూరం చేసుకున్నారు. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వకుండా నియంతలా వ్యవహరించారు. కేవలం సంక్షేమ పథకాలను నమ్ముకుని నట్టేట మునిగారు. ఎమ్మెల్యేలను, మంత్రులను నియోజకవర్గాలను మార్చి భంగపడ్డారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వకుండా అధికారాన్ని చేజేతులా కోల్పోయారు. పింఛను కూడా పెంచనని చెప్పి ఓట్లను తనకు కాకుండా చేసుకున్నారు. ఎలాంటి హామీలు ఇవ్వకుండా కేవలం తన బటన్ నొక్కడమే తనకు మరోసారి విజయం తెచ్చిపెడుతుందని గుడ్డిగా నమ్మారు. అదే చివరకు కొంపముంచింది. ఇప్పటికీ మద్యం, ఇసుక విషయాల్లో తన స్టాండ్ మార్చుకోలేదంటే మూర్ఖత్వమని భావించాలా? డీల్ చేయడం తెలియదని అనుకోవాలా? అనేది వైసీపీ నేతలకే తెలియడం లేదు.
కుటుంబ సమస్యను..
ఇక కుటుంబంలో సమస్యను సీరియస్ గా తీసుకోవాల్సిన జగన్ లైట్ గా తీసుకున్నారు. తన చెల్లెలు వైఎస్ షర్మిలను దూరం చేసుకున్నారు. రాహుల్ గాంధీని చూశారుగా.. తన సోదరి ప్రియాంకకు వాయనాడ్ స్థానంలో అభ్యర్థిగా ప్రకటించారు. చంద్రబాబు బాలకృష్ణను ఎమ్మెల్యేగా చేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన సోదరుడు నాడు వైఎస్ వివేకానందరెడ్డిని ఎంపీగా, ఎమ్మెల్యేగా చేశారు. ఇన్నీ తెలిసినా షర్మిలను దూరం పెట్టారు. చివరకు ఆస్తుల వివాదాన్ని కూడా కొని తెచ్చుకున్నారు. కనీసం ఆస్తుల వివాదాన్ని అయినా పట్టుకుని లాగకుండా.. పట్టు విడుపులు ప్రదర్శించి ఉంటే కొంత వరకూ రాజకీయంగా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు తనంతట తానే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లయింది. అంటే ఎంతమందిని చూసైనా జగన్ నేర్చుకోరా? జగన్ కు తెలియదని కాదు. తెలిసీ తప్పుటడుగులు వేస్తున్నారంటే.. డీల్ చేయడం రాదని అనుకోవాలా? లేక నేనింతేనంటూ మొండితనంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నారా? అన్నది మాత్రం ఆయనకే తెలియాలి. జగన్ ను ఆ దేవుడే రాజకీయంగా కాపాడాలి అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ ఇప్పుడు కుటుంబంలోనూ ఒంటరి వాడయ్యాడు.
Next Story